Telangana | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్ వర్క్, ఏప్రిల్ 4: రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండుగ నాడు రేషన్‌కార్డుదారులకు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఆదిలోనే నిరాశ పరిచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని రేషన్ దుకాణాల్లో మూడో రోజు నుంచే ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తగినంత నిల్వలు లేకపోవడంతో చాలా దుకాణాల్లో తొలి రెండు రోజులు మాత్రమే అరకొరగా పంపిణీ సాగింది. ‘బియ్యం స్టాక్ లేదు.. బియ్యం వచ్చాక పోస్తాం. వారం రోజులు ఆగాలి’ అంటూ డీలర్లు రేషన్‌కార్డుదారులను ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తున్నారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అధికారులు తొలి విడతగా రేషన్‌షాప్‌లకు 50% బియ్యాన్ని అలాట్ చేశారు. అది కూడా అయిపోవడంతో చాలామంది డీలర్లు రేషన్‌షాపులను మూసివేశారు.
మంచిర్యాల పట్టణంలో మొత్తం 142 షాపులు ఉండగా, 1,530.33 టన్నుల బియ్యం అవసరం కాగా, 50% కోటానే షాపులకు పంపించారు. శుక్రవారం 47 షాపులకు 100% బియ్యం సరఫరా చేయగా, మరో 95 షాపులకు 593.561 టన్నుల బియ్యాన్ని పంపించాల్సి ఉన్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో ఉన్న 32వ రేషన్ దుకాణంలో సన్న బియ్యం కోసం వచ్చిన మహిళలు రేషన్ లేకపోవడంతో వెనుదిరిగి పోయారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరిఖనిలో స్టాక్ లేకపోవడంతో రేషన్ డీలర్లు దుకాణాలు మూసివేశారు. దీనిపై తహసీల్దార్ కుమారస్వామిని వివరణ కోరగా, తమకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4 నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. కానీ, శుక్రవారం కూడా గోదావరిఖనిలోని పలు డివిజన్లలో రేషన్ దుకాణాలు మూసే ఉన్నాయి. బెల్లంపల్లిలోని 23వ రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించగా, శుక్రవారం ఉదయానికే స్టాక్ అయిపోయినట్టు సదరు డీలర్ చెప్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిరోజు రేషన్ షాపులకు 50% స్టాక్ మాత్రమే చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంతోపాటు అన్నపురెడ్డిపల్లి మండలంలోని నాలుగు గ్రామాల్లో బియ్యం పంపిణీ చేపట్టలేదు. చండ్రుగొండ మండలంలో తొలిరోజు బియ్యం పంపిణీ చేసినప్పటికీ, ఆ తరువాత రెండు రోజులపాటు హమాలీల సమ్మె వల్ల బియ్యం డీలర్లకు చేరలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,480 టన్నుల బియ్యం అవసరం కాగా, 4,700 టన్నుల బియ్యం తోలకం పూర్తి చేసినట్టు సివిల్ సైప్లె డీఎం త్రినాథ్‌బాబు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 748 రేషన్ దుకాణాల ద్వారా 7,231 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,661 టన్నులు మాత్రమే రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు.