హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 7,411 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 420 టన్నుల ధాన్యానికి రూ.622 కోట్లు చెల్లించినట్టు, రైతులకు అదనంగా 500 బోనస్ ఇస్తున్నట్టు తెలిపారు. రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని, అంతకంటే ఎకువ ఉన్న వారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పత్తి దిగుబడి తగ్గినా కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు.