జైపూర్: రాజస్థాన్లోని నాగౌర్లో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇటీవల ఒక విద్యుత్తు కారుకు కాలుష్య నియం త్రణ ధ్రువీకరణ పత్రం లేదని జరిమానా విధించారు. ఇదేమి చోద్యమని నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పోలీస్ శాఖ స్పందించి.. దీనిపై దర్యాప్తు జరిపి సదరు జరిమానాను రద్దు చేస్తామని పేర్కొన్నది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ టాటా టియాగో ఈవీ కారుకు విండ్షీల్డ్ షేడ్స్ లేవని ఓ ఏఎస్సై ఆ కారును ఆపి రూ.200 జరిమానాగా విధించారు. అయితే వాహన కాలుష్యం నియంత్రణలో ఉందని తెలిపే పీయూసీ సర్టిఫికెట్ లేదనే కారణంతో రూ.1,500 జరిమానా అదనం గా విధించారు. తనది విద్యుత్తు కారని.. దానికి ఆ ధ్రువీక రణ పత్రం అవసరం లేదని కారు యజమాని వాదించినా ఏఎస్సై వినిపించుకోలేదు. అయితే దీనిపై రాజస్థాన్ పోలీస్ విభాగం స్పందిస్తూ.. ఆ జరిమానా పొరబాటున జారీ అయ్యి ఉండొచ్చని తెలిపింది. కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు, 1989 ప్రకారం విద్యుత్తు వాహనాలకు కాలు ష్య నియంత్రణ తనిఖీల నుంచి మినహాయింపు ఉంది.