Telangana | హైదరాబాద్, జనవరి27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగంలో చేరి నాలుగు నెలలైనా ఇంకా తొలి జీతం అందని దాక్ష మాదిరిగానే వెక్కిరిస్తున్నది. ఇదీ ఇరిగేషన్‌శాఖలో నూతనంగా నియమితులైన ఏఈఈల ఆవేదన. అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా, స్వయంగా మంత్రి కలుగజేసుకున్నా ఇప్పటికీ వారికి వేతనం అందలేదు. నీటిపారుదల శాఖలో ఇటీవల కొత్తగా 677 మంది ఇంజినీర్లను నియమించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను అనుసరించి టీజీపీఎస్సీ ఏఈఈలను నియమించింది. తదనంతరం ఇరిగేషన్‌శాఖకు ఆ జాబితాను పంపింది. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను మరోసారి నిర్వహించారు.
అనంతరం పోస్టింగ్ ఆర్డర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గత సెప్టెంబర్‌లో అందజేశారు. పోస్టింగ్ అందుకున్న 677 మందిలో 122 మంది ఏఈఈలకు సంబంధించిన వేతనాలను చెల్లించకుండా ఆర్థికశాఖ నిలిపివేసింది. వీరికి 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారంటూ మెలికపెట్టింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల ఎంపిక, పోస్టింగ్ ఆర్డర్లు ఒకే విధంగా ఉండాలని, కానీ, అందుకు భిన్నంగా పోస్టింగ్ ఇచ్చారంటూ అభ్యంతరం తెలిపింది. మల్టీజోన్-1కు చెందిన దాదాపు 95 మంది ఏఈఈలకు మల్టీజోన్-2లో, మల్టీజోన్-2కు ఎంపికైన 27 మంది ఏఈఈలకు మల్టీజోన్-1లో పోస్టింగ్ ఇచ్చారని వివరించింది. మొత్తంగా 122 మంది ఏఈఈల పోస్టింగ్‌పై వివరణ ఇవ్వాలని ఇరిగేషన్‌శాఖకు సూచించింది.
ఇరిగేషన్ శాఖ అసహనం
ఆర్థికశాఖ అభ్యంతరాలపై ఇరిగేషన్ శాఖ అసహనం వ్యక్తంచేస్తున్నది. ఇరిగేషన్‌శాఖలో ఆ తరహా పోస్టింగ్ ప్రక్రియ లేదని వాదిస్తున్నది. ప్రాజెక్టుల నిర్వహణ, పనుల అవసరాల రీత్యా ఇరిగేషన్‌శాఖలో పోస్టింగ్‌లు కొనసాగుతాయని, అయితే సదరు ఉద్యోగుల సర్వీస్ మొత్తంగా వారివారి జోన్లోనే ఉంటుందని వెల్లడించింది. గత 40 ఏండ్లుగా ఈ విధానం అమలులో ఉన్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, పనులు అవసరాల రీత్యానే తాజాగా పోస్టింగ్‌లను ఇచ్చామని చెప్తున్నారు. దీనిపై ఆర్థికశాఖ కొర్రీలు పెట్టడంపై ఇరిగేషన్‌శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నది.
మంత్రి ఆదేశించినా బేఖాతర్
తొలి వేతనం కోసమే నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న 122 మంది ఏఈఈలు ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. మంత్రి కూడా అప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. వేతనాలను చెల్లించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికి పది రోజులు గడుస్తున్నా ఏఈఈలకు వేతనాలు చెల్లించకపోవడం గమనార్హం. దీంతో ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను మరోసారి కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. దూరప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ ఖర్చులు భరించలేకపోతున్నామని, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని, సమస్యను పరిష్కరించి ఏఈఈలకు వేతనాలను అందేలా చొరవ చూపాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపోలు రవీందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్, వరింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.