ఆదిలాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఝూటాబాజీ పాలన కొనసాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే వాస్తవాలు తెలుసుకోకుం డా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాలుకకు నరం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు గురువారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించారు. బాసరలో సరస్వతి అమ్మవారిని దర్శించుకొని అక్కడ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముథోల్‌లో 30 పడకల దవాఖాన, నిర్మల్‌లో రూ.40 కోట్లతో నిర్మించే 250 పడకల దవాఖానకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌లో రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందని తెలిపారు.
అభివృద్ధిపై చర్చకు వస్తారా?
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? అని కాంగ్రెస్, బీజేపీ నేతలకు మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్నట్టు రైతులకు ఉచిత విద్యుత్తు పథకం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎందుకు అమలుచేయటంలేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ద్వారా అన్నదాతలకు రూ.50 వేల కోట్లు ఇచ్చిన ఖ్యాతి తెలంగాణకు దక్కిందని చెప్పారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో కేంద్రం తెలంగాణను మభ్యపెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. ‘రూ.25 వేల కోట్లు ఇస్తామని చెప్పి రైతులు బావుల వద్ద కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నది. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తిరస్కరించారు.
ఒకపూట ఉపవాసమైనా ఉంటాం కానీ, రైతులకు అన్యాయం జరగనివ్వం అని తేల్చిచెప్పారు’ అని హరీశ్‌రావు అన్నా రు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. పేదలకు వైద్యసేవలు అందించటంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నదని కేంద్రప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ఆదిలాబాద్ సీసీఐని తెరిపించాలని సవాల్ విసిరారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్పర్సన్లు విజయలక్ష్మి, రాథోడ్ జనార్దన్, టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.
8 గంటల్లోనే నెరవేరిన హామీ
బాసర, మార్చి 3: బాసరకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని, ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్‌రావు మంత్రి హరీశ్‌రావును గురువారం ఉదయం కోరారు. 24 గంటల్లో బాసరకు అంబులెన్స్ వస్తుందని ఉదయం సభా ప్రాంగణంలోనే మంత్రి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 8 గంటల్లోనే బాసరకు అంబులెన్స్ చేరుకొన్నది. దీంతో గ్రామస్థులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంబులెన్స్‌ను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం పూజలు నిర్వహించి ప్రారంభించనున్నారు.