హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఇంజినీర్ల కొరత సమస్య, పర్యవేక్షణ లోపం నేపథ్యంలో టీజీ జెన్కో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వైటీపీఎస్‌కు ఎట్టకేలకు 81 మంది అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ల (ఏడీఈ)లను కేటాయించింది. పదోన్నతి పొందిన వారికి వైటీపీఎస్‌లో పోస్టింగ్స్ ఇచ్చింది. వైటీపీఎస్‌లో ఒక యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. మరో యూనిట్లో ట్రయర్ రన్ నడుస్తున్నది. ఇటీవలే యూనిట్-1లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్లాంట్ ఓఅండ్ఎంను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈ), అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ల (ఈఈఏ)కు అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లుగా పదోన్నతులు కేటాయించినా పోస్టింగ్స్ ఇవ్వడంలేదన్న ఆరోపణలొచ్చాయి. ఇదే విషయాన్ని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘వైటీపీఎస్ ప్రై‘వేటు” శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన యాజమాన్యం 81 మంది ఇంజినీర్లను కేటాయించింది. అలాగే, భద్రాద్రి ప్లాంట్‌కు 41మంది, కేటీపీపీకి 43 మంది, కేటీపీఎస్కు 24 మందికి పోస్టింగ్స్ ఇచ్చింది.
జెన్కో ఉద్యోగులు కొందరిని బదిలీ చేసి నిలుపుదల చేయడం వివాదాస్పదమవుతున్నది. ఇటీవల రామగుండంలోని ఆర్టీఎస్లో పనిచేస్తున్న 72 మంది ఓఅండ్ఎం స్టాఫ్, 11 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, ఒక అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్‌ను వైటీపీఎస్, బీటీపీఎస్‌కు బదిలీచేశారు. తాజాగా 11 మంది ఓఅండ్ఎం స్టాఫ్ బదిలీని నిలుపుదల చేశారు. మరికొందరు రిలీవ్ కాలేదని తెలిసింది. యాదాద్రిలో ఉద్యోగుల కొరత సమస్య ఉండగా, ఆర్టీఎస్ ప్లాంట్ మూతపడ్డా మిగులు ఉద్యోగులున్నారు. వీరికి ప్రతి నెలా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.