Rayalaseema Lift | హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను అడ్డుకోవాల్సిన కేంద్రమే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. అడుగడుగునా వత్తాసు పలుకుతున్నది. ప్రాజెక్టు పనులు కొనసాగేందుకు పరోక్షంగా మద్దతునిస్తున్నది. అందుకు కేంద్ర సంస్థల వ్యవహారశైలి ఊతమిస్తున్నది. ప్రాజెక్టును మార్చి నెలలో సందర్శించి పనులు కొనసాగుతున్నాయని గుర్తించినా ఆ నివేదికను వారం రోజుల కిందటి వరకు ఎన్జీటీకి సమర్పించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదే నివేదికను సమాచారహక్కు చట్టం కింద కోరితే మాత్రం ఐదునెలల ముందుగానే ఇవ్వడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లితే.. ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల్లేకుండానే రాయలసీమ ప్రాజెక్టును చేపట్టిందని నారాయణపేట జిల్లాకు చెందిన ఒకరు ఎన్జీటీని ఆశ్రయించడం, దీనిపై వాస్తవాలను తేల్చేందుకు ఇప్పటికే కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటవడం, నివేదికను సమర్పించడం తెలిసిందే. ఆ ప్రాజెక్టు పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెప్తున్న విషయాలన్నీ అబద్ధమేనని ఆ నివేదిక స్పష్టంచేసింది. దీనిని అనుసరించి పర్యావరణ అనుమతులు పొందేవరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టవద్దని, కనీసం డీపీఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలు, పనులను చేపట్టవద్దని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
అయినప్పటికీ ఏపీ సర్కారు ఆర్ఎల్ఐఎస్ పనులను కొనసాగించడంతో ఎన్జీటీలో మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ మరోసారి జాయింట్ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి నివేదికను అందించాలని కేంద్ర పర్యావరణశాఖకు చెందిన సైంటిస్టుతోపాటు, మరో ఇద్దరు సభ్యులను కూడా నియమించింది. ఆ కమిటీ ఈ ఏడాది మార్చి నెలలోనే ప్రాజెక్టును సందర్శించింది. అందుకు సంబంధించిన నివేదికను సైతం జూలైలోనే సిద్ధం చేసింది. కానీ. ఎన్జీటీకి ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. మరోవైపు తెలంగాణకు చెందిన ఒకరు కేంద్ర పర్యావరణశాఖకు ఇదే విషయమై ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే మాత్రం అందుకు సంబంధించిన నివేదికను ఇచ్చింది. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని జాయింట్ కమిటీ రిపోర్టు కూడా స్పష్టం చేయడం గమనార్హం. మొత్తంగా ఏపీ కొనసాగిస్తున్న పనులకు కేంద్రమే పరోక్షంగా మద్దతు ఇస్తున్నదని తేలిపోతున్నది. ఇదిలా ఉంటే, ఏపీ ప్రభుత్వం ఆర్ఎల్ఐఎస్ పనులను కొనసాగిస్తున్నదని గత డిసెంబర్లోనే ఆధారాలతో సహా పలువురు బయటపెట్టారు. ఆ వెంటనే హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని కోరుతూ కంటితుడుపుగా కేంద్రానికి, కేఆర్ఎంబీకి లేఖలు రాసి చేతులు దులుపుకున్నది. కానీ ప్రాజెక్టు పనులు నిలిపివేయించేలా ఏనాడూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన దాఖలాల్లేవు.