అసైన్డ్ భూములకూ అగ్రిమెంట్లు కుదురుతున్నయి. లావణి పట్టాల రికార్డులు లాఘవంగా మాయమవుతున్నయి. సీలింగ్ భూములు సిత్రంగా ముడుచుకుంటున్నయి. ప్రభుత్వ భూములు పదిలంగా వివరాలు దాచుకుంటున్నయి! హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రైసిటీలో ఎఫ్టీఎల్, బఫర్, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంటూ హడావుడి చేస్తున్న హైడ్రా, హెచ్ఎండీఏ, రెవెన్యూ.. ఏదీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ఐటీ సిటీ రాయదుర్గంలో ఆక్యుపెన్సీ లేదన్న మెట్రో రైలు, ఊరి జనమే లేని ఆ నగరానికి ఉరకలు పెడతానంటున్నది. రద్దీయే లేని చోటుకు 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పరుగులు తీస్తుందట. రీజినల్ రింగు రోడ్డు రంగులు మార్చుకుంటుందట.కొత్త రేడియల్ రహదారులు పరుచుకుంటాయట. కనెక్టింగ్ రోడ్లు కనికట్టు చేస్తాయట! కొత్త ప్రాజెక్టుల్ని అక్కడే ప్రకటించాలని రియల్టీ కంపెనీలపై ఒత్తిళ్లు వస్తున్నయ్!!
సిటీలోఉన్న ప్రాజెక్టులు రద్దవుతున్నయ్. నూతన ప్రణాళికలు ఊపిరి పోసుకుంటున్నయ్! భూమి సిద్ధంగా ఉన్నా ఫార్మాసిటీ రద్దయింది. సిటీలో రద్దీ ఉన్నా ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం మళ్లీ పోయింది. అకస్మాత్తుగా హైడ్రా అవతరించి, సిటీలో రియల్టీ డిమాండ్‌ను బుల్డోజర్లతో తొక్కించింది. వెలుగుల నగరాన్ని కాదని, ఇంకా మొ(ద)లవని సిటీకి ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడుతున్నాయి. స్కిల్ వర్సిటీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ.. ఇలా అన్నీ అక్కడికే దారితీస్తున్నయి. ఏ మౌలిక వసతులూ లేని అచ్చోటకు పెట్టుబడుల ప్రకటనలు వెల్లువెత్తుతున్నయి.
రోజుకో కొత్త పేరుతో పెద్దల నోటి నుంచే ప్రమోషన్ యాక్టివిటీ సాగుతున్నది! జర్నలిస్టులూ ప్రమోట్ చేస్తే, అక్కడే ఇళ్లస్థలాలు ఇస్తామన్న ఎరలూ మొదలయ్యాయి. ఇంతకీ ఏమిటీ కథ!
ఆ ప్రాంతం హైదరాబాద్‌కు దక్షిణాన ఉంది. దానికిప్పటికే నాలుగు ఘనమైన పేర్లతో నామకరణం జరిగింది. రాచకొండ సిటీ!..ఫోర్త్ సిటీ..!.. ఏఐ సిటీ!.. ఫ్యూచర్ సిటీ! పేరేదైతేనేం… తెరవెనుక ఉన్నది పెద్దలు! వందల ఎకరాలు! కోట్ల దందాలు! ఒత్తిళ్లు-ఒప్పందాలు!
నాలుగో నగరం కింద నలుగుతున్నది నిరు పేదలు. వాళ్ల భూముల్ని చెరబడుతున్నది పెద్దలు. వస్తుందో రాదో తెల్వని ఫోర్త్‌సిటీ కోసం ఫ్యూచర్‌ను కోల్పోతున్నది బడుగు రైతులు. మరి ఈ రంగులరాట్నం తిప్పుతున్నదెవరు? కాచుకుని కూర్చున్న రాబందులెవరు? ఇది అందినకాడికి అమ్ముకునిపోయే ఆర్టిఫిషియల్ బూమా? కండ్లు బైర్లు కమ్మించే అమరావతి కథా?
ఫ్యూచర్ సిటీ.. వర్తమానంపై‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలు నేటి నుంచి…
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ): ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగంలో రాష్ట్రవ్యాప్తంగా స్తబ్దత నెలకొన్న తరుణంలో హైదరాబాద్‌కు దక్షిణ భాగాన మాత్రం అనూహ్య అలజడి కనిపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, ముచ్చర్ల, తుక్కుగూడ మొదలు యాచారం వరకు భూమాయాజాలం కొనసాగుతున్నది. ఒకవైపు రాష్ట్రమంతా వ్యవసాయ భూముల ధరలు పడిపోతుంటే.. అక్కడ మాత్రం అవి ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్నిచోట్లా ప్లాట్ల రేట్లు పడిపోతుంటే.. అక్కడ మాత్రం రెట్టింపు అయ్యాయి. ఈ వింత, విచిత్రం ఎలా సాధ్యమవుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీసినప్పుడు.. విస్తుగొల్పే నిజాలు, విస్మయపరిచే విషయాలు బయటకువచ్చాయి.
అంతా గోప్యం.. అధికారుల మౌనం
అక్కడ వందల ఎకరాలు చేతులు మారుతున్నా అంతాగోప్యం! వేల కోట్ల దందాలు సాగుతున్నా అంతా గప్‌చుప్! పెద్దల ఒత్తిడితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవం చెప్పలేక, విషయం దాచలేక మల్లగుల్లాలు పడుతున్నారు. తమకేమీ తెలియనట్టే నటిస్తున్నారు. వారం రోజులక్రితం ఓ కీలక నేత నివాసంలో ఫ్యూచర్ సిటీపై కీలక సమావేశం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఆ మీటింగ్‌లో రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పు.. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ కోసం చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన వంటి వాటిపై వివరించిన సదరు నేత చివరికి ఓ హెచ్చరికతో ముగించారని సమాచారం. ‘అధికారులెవరూ నోరువిప్పొద్దు. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తా. అంతవరకు విషయం బయటకు పొక్కితే సీరియస్‌గా ఉంటుంది’ అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.
ఫార్మా రద్దుతోనే తొలి అడుగు
ఫార్మాసిటీ రద్దుతోనే తొలి అడుగు పడింది. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో అసలు కథ మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 19వేల ఎకరాల భూసేకరణ పూర్తిచేసి ఫార్మాసిటీ రూపొందిస్తే.. దాన్ని రద్దు చేసి అదే భూములు లక్ష్యంగా సర్కారు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నది. కొత్త ప్రాజెక్టులను అక్కడికే తరలిస్తున్నది. స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీతోపాటు ఏఐ సిటీ వంటి వాటినీ దక్షిణానికే తరలిస్తున్నది. అంతర్జాతీయ కంపెనీలకూ అక్కడే భూ కేటాయింపులు జరుపుతున్నది. ఫోర్త్‌సిటీకి ప్రభుత్వ పెద్దలే బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తుండటం గమనార్హం. ఫలితంగా మౌలిక వసతుల కల్పనంతా అక్కడికే మళ్లుతున్నది. ఆక్యుపెన్సీ లేదనే సాకుతో రాయదుర్గం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసిన ప్రభుత్వం.. పట్టుమని పది ఆవాసాలు లేని ఫోర్త్ సిటీకి ఇప్పుడే మెట్రో రైలును నిర్మించే పనిలో తలమునకలైంది. మూడు నగరాల్లో లేనివిధంగా నాల్గోనగరిలో అవసరం లేకున్నా… 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఫ్యూచర్ సిటీ హైప్ కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు తేటతెల్లమవుతున్నది. అసలు హైడ్రా పేరుతో ట్రైసిటీలో చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత కూడా భావినగరం వైపు రియల్టీ మళ్లించేందుకేనన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.