Gram Panchayat Elections | హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ పార్థసారధి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ సంగ్రామ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 6న ఓటర్ల జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు. 9,10 తేదీల్లో ముసాయిదాపై కలెక్టర్లు, మండలాభివృద్ధి అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియపై అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 29న ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.