హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మాజీ సైనికోద్యోగుల (ఎక్స్-సర్వీస్‌మెన్) కోటాలో తన తండ్రికి వచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మీర్పూర్కు చెందిన మైమూనా బేగం వాపోయారు. శనివారం ఆమె తన భర్త రఫీ, జీపీఏ హోల్డర్ వాసిరెడ్డి సతీశ్ కుమార్‌తో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 1964లో తన తండ్రి షేక్ అహ్మద్‌కు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో ఐదెకరాల భూమి కేటాయించిందని, ఆ భూమికి 1994 జూన్ 19న ఫైనల్ పట్టా జారీ అయిందని తెలిపారు.
2005లో తన తండ్రి మరణించాక వారసత్వంగా ఆ భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకునేందుకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లడంతో అప్పటికే ఆ భూమి సినీనిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు కుటుంబసభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు స్పష్టం చేశారని చెప్పారు. తన తండ్రి పేరిట కే కృష్ణ అనే వ్యక్తి 1992లో నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) సృష్టించి, 1996లో ఆ భూమిని అక్రమంగా విక్రయించినట్టు తెలిసిందని వివరించారు. ప్రస్తుతం హైకోర్టు నుంచి స్టేఆర్డర్ ఉండగానే వారికి చెందిన 21 ఎకరాలతోపాటు తమ ఐదెకరాల భూమిని కలిపి అభివృద్ధి పేరిట ఓ నిర్మాణ సంస్థకు అప్పగించారని అన్నారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు తగిన ఆధారాలతో ఫిర్యాదులు సమర్పించామని తెలిపారు.