హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ) : ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ(76) హైదరాబాద్లోని దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆటా వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన, ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైదరాబాద్ దవాఖానలో చేరారు. వడ్డేపల్లి సిరిసిల్లలో ఓ చేనేత కుటుంబంలో జన్మించగా, హైదరాబాద్లోని నాగోల్లో స్థిరపడ్డారు. రెండ్రోజుల క్రితమే తెరసం ఆయనకు జీవనసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.వడ్డేపల్లి కృష్ణ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ మృతికి కవులు, కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.