భీమ్‌గల్/డిచ్పల్లి, జూలై 16: వర్షాలు కురవక పోయినా అన్నదాతకు బాసటగా నిలువడం ఒక్క సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ పెద్దగంటి ఎల్లమ్మ క్షేత్రం సమీపంలో ప్యాకేజీ-21 ద్వారా వచ్చిన కాళేశ్వర జలాలను కప్పల వాగులోకి ఆదివారం విడుదల చేశారు. అంతకుముందు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని జక్రాన్‌పల్లి మండలం చింతలూర్ పెద్దవాగులోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. కప్పలవాగు వద్ద రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి వేముల నీటిలో దిగి సంబురాలు చేసుకొన్నారు. అభిమానులు మంత్రిని తమ భుజాలపై ఎత్తుకొని ‘జై కేసీఆర్, జై ప్రశాంత్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు.
ఇలాంటి అపూర్వఘట్టాన్ని ఎన్నడు చూడలేదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కప్పలవాగు, పెద్దవాగు వద్ద మంత్రి వేముల మాట్లాడుతూ.. కరువులో కూడా 300 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వర జలాలు వరద కాలువ ద్వారా ఎదురెక్కి ఎస్సారెస్పీలోకి రావడం ఒక అద్భుతమైన ఘట్టమని, ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాద్యమైందని కొనియాడారు. కాళేశ్వర జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుంచి ఎస్సారెస్పీలోకి చేరుకొని సారంగపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ ప్యాకేజీ -20, 21 ద్వారా ఆదివారం పెద్దవాగు, కప్పలవాగులోకి చేరుకున్నాయని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ రైతులకు ప్యాకేజీ -21 ద్వారా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. పైప్‌లైన్ ద్వారా ప్రతి మూడు ఎకరాలకు ఒకసాగు నీటి ఔట్లెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా నల్లా నీరు అందించినట్టు పొలాల్లోకి వాల్వు ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. ఒక సీజన్లో పంటలు వేయకుండా రైతులు పైప్‌లైన్ కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజక వర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే 20, 21వ ప్యాకేజీ పనులకు సీఎం కేసీఆర్ పెద్దమనసుతో రూ.2,600 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ప్రాజెక్టు డిజైన్ చేసి పూర్తి చేసినట్టు చెప్పారు.
కాళేశ్వర గంగ.. ఇంటికి పవిత్రంగా
ప్రతి ఇంట్లో శుభకార్యాలు, పండుగల వేళ దేవతామూర్తులను అభిషేకించేందుకు.. గంగ నుంచి నీళ్లు తెచ్చుకొని బాటిళ్లు లేదా రాగి చెంబుల్లో నిల్వ ఉంచుకుంటారు. ఆదివారం భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన శ్రీపాదరత్నాచారి అనే రైతు ముప్కాల్ పంప్‌హౌస్ వద్ద ఎదురెక్కి వస్తున్న కాళేశ్వర జలాలను పవిత్రంగా భావించి బాటిళ్లలో తన ఇంటి శుద్ధి కోసం తీసుకెళ్తున్నాడు. పంటలు సమృద్ధిగా పండేందుకు, పవిత్రతను కాపాడేందుకు రాగి ముంతలు, డబ్బాల్లో ఈ నీళ్లను తీసుకెళ్తున్నారు.
-కమ్మర్పల్లి/ముప్కాల్/మెండోరా