Sand Mafia | హనుమకొండ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య ఇసుక రవాణా అంశం వివాదంగా మారింది. ఈ పంచాయతీ చివరికి వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్దకు చేరింది. త్వరలో జరిగే సమీక్షలో తగిన నిర్ణయం తీసుకుందామని ఆయన తప్పుకొంటున్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదలు ఇబ్బంది పడుతున్నారు. వివాదాస్పద వ్యవహారశైలితో విమర్శలపాలవుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర మరోసారి ఇలాగే చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలోని ఇసుక మరో నియోజకవర్గంలోని వారికి అందకుండా ఎమ్మెల్యే సత్యనారాయణరావు కొత్త నిబంధన విధించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న ఇండ్లకు ఇసుక రవాణా కాకుండా అడ్డుకుంటున్నారు. సహజ వనరులను అందరికీ చెందుతాయనే విషయాన్ని మరిచి భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగుల్లో ఇసుకను పక్కనే ఉన్న పరకాల నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రవాణా కాకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలు జారీచేశారు.
ఒక్క ట్రాక్టర్ ఇసుక వెళ్లినా పోస్టింగులు తీసేస్తానని అధికారులను హెచ్చరించినట్టు సమాచారం. ఈ క్రమంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, మొగుళ్లపల్లి నుంచి పరకాలకు ఇసుకను తరలించే ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. రేగొండ వద్ద పరకాలకు వెళ్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను, మొగుళ్లపల్లి మండలం రంగాపురం వద్ద ఐదు ట్రాక్టర్లను పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఇసుక రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చెప్పడంతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. అధికారులతో మాట్లాడితే ఎమ్మెల్యే సత్యనారాయణరావు చెప్పడం వల్లే ఇసుకను పంపించడంలేదని అన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే స్పందించలేదు. ఇసుక రవాణాపై ఎమ్మెల్యే ఆంక్షలు పెట్టడం ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు, ఇతర అవసరాలకు రవాణా జరుగుతున్నది. ఇక్కడి నుంచి ఇతర నియోజకవర్గాల్లోని గ్రామాలకు తరలించే ఇసుక రవాణాలో దోపిడీ జరుగుతున్నది. పేదల ఇండ్లకు ఇసుక రవాణా అంశాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే అనుచరులు దోపిడీ చేస్తున్నట్టు సమాచారం.