Chandrababu | బంజారాహిల్స్, మార్చి 12 : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. అన్న చందంగా తమ పరిస్థితి మారిందంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం 71 నవ నిర్మాణనగర్లోని ఏపీ సీఎం చంద్రబాబు క్వార్టర్స్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో పనిమనుషులు, డ్రైవర్లు, ఇతర పనివారి కోసం 1998 ప్రాంతంలో షేక్‌పేట మండల సర్వేనెంబర్ 403లోకి నవ నిర్మాణనగర్ కాలనీని అనుకుని ఉన్న సుమారు 2వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.
ఈ స్థలంలో చంద్రబాబు ఇంట్లో పని చేసిన రుబియా బీకి, ఖుర్సీదా బేగం, డ్రైవర్లుగా పనిచేసిన రవి, కిషన్, దోబీగా పనిచేసిన కళావతి తదితరులకు 50 గజాల చొప్పున కేటాయించారు. కొన్నాళ్లకు వాళ్లందరికీ పట్టాలు సైతం అప్పటి ప్రభుత్వం మంజూరు చేయగా వారితో పాటు వారి కుటుంబసభ్యులు ఇండ్లును కట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. మిగిలిన స్థలంలో సర్వెంట్స్ కోసం మరో 6 ఇండ్లను కట్టారు. పట్టాలు పొందిన వారిలో కొంతమంది చనిపోగా, వారి స్థానంలో కుటుంసభ్యులు నివాసం ఉంటున్నారు. దీన్నిసీఎం క్వార్టర్స్ పేరుతో పిలుస్తుంటారు.
ప్రస్తుతం ఈ బస్తీలో సుమారు 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇదిలా ఉండగా సుమారు 30 ఏళ్లుగా డ్రైనేజీ లైన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బస్తీవాసులు మురుగును పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీ పైభాగంలోని దిల్ ల్యాండ్స్లోకి వదిలేవారు. ఇదిలా ఉండగా జర్నలిస్ట్ కాలనీ వాసుల ఫిర్యాదుతో నవ నిర్మాణనగర్లోని సీఎం క్వార్టర్స్‌నుంచి మురుగు వదిలేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో గత రెండేళ్లుగా క్వార్టర్స్ వాసులు అధికారుల చుట్టూ తిరగడంతో ఎట్టకేలకు ఇటీవల సివరేజ్ లైన్ మంజూరైంది. సీఎం క్వార్టర్స్ నుంచి నవ నిర్మాణనగర్ రోడ్ నెం 71 జీ దాకా సివరేజ్ లైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరవడంతో పాటు పనులు ప్రారంభమయ్యాయి.
అయితే బస్తీలోని క్వార్టర్స్‌లో ఉంటున్న వారి మధ్యన విభేదాలు రావడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో ఇస్త్రీ చేసే మూర్తి అనే వ్యక్తి ఉంటున్న క్వార్టర్స్ ముందు రోడ్డును ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేయడం వివాదాన్ని రాజేసింది. క్వార్టర్స్ నిర్మించినప్పటి నుంచి తాత్కాలికంగా వేసుకున్న డ్రైనేజీలైన్ను ఆక్రమించుకుని సుమారు 8 అడుగుల మేర ముందుకు రావడంతో అక్కడనుంచి సివరేజ్ లైన్ వేయడానికి మూర్తి అంగీకరించడం లేదని, అతడి ఇంటి ముందు చెట్లను సాకుగా చూపి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడంటూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కొంతమంది జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమంగా వేసిన షెడ్డును తొలగించాలని సూచించారు. అయితే షెడ్డును తొలగించేది లేదని, మూర్తితోపాటు పక్కింట్లోని మరికొంతమంది అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. 30 ఏళ్లుగా సివరేజ్ సమస్యలు, రోడ్డు లేకపోవడంతో తాము ఇబ్బంది పడి వాటిని మంజూరు చేయిస్తే రోడ్డుకు అడ్డుగా షెడ్డు నిర్మించడంతో పాటు చంద్రబాబు పీఏ పేరుతో తమను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని, పోలీసులు, అధికారులు సైతం వారికి సహకరిస్తున్నారని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు చంద్రబాబు ఇండ్ల స్థలం ఇచ్చి ఆదుకుంటే ఆయన పేరుతో కొంతమంది ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా క్వార్టర్స్‌లో ఖాళీగా ఉన్న ఇండ్లను కాజేసేందుకు సీఎం చంద్రబాబు పేరుతో కొంతమంది దళారులు నాటకం ఆడుతున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.