హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో బీజేపీపై పోరాటం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరా ట వారోత్సవాల సందర్భంగా సీపీఎం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమైందని మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను మోదీ.. కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపాధి కరువైందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, జీఎస్టీ పేరుతో కేంద్రం పేద ప్రజలపై భారం మోపుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కరోనా సమయంలోనూ ప్రజలను ఆదుకోని బీజేపీని గద్దెదింపాలన్నారు. కమలం పార్టీని వ్యతిరేకించే శక్తులతో కలిసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. లౌకిక పార్టీలతో కలిసి బీజేపీపై దేశవ్యాప్త పోరాటాలు చేస్తామన్నారు. ఆ పార్టీ మతోన్మాద విధానాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదని మండిపడ్డారు. మతం పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు.