ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 17: సవాలక్ష కొర్రీలతో అరకొరగా రుణమాఫీ చేసిన సర్కారు వరదసాయంలోనూ తన మార్క్ చూపింది. వరద బాధితులను క్యాటగిరీలుగా విభజించి వరదసాయంలోనూ మెలిక పెట్టింది. ఫోన్‌నంబర్లు ఒకేలా ఉన్నాయని, ఖాతా నంబర్లు లేవని కారణాలు చెబుతూ వరద బాధితులను నిండాముంచింది. మున్నేటి వరద తమ ఇండ్లను ముంచెత్తితే.. ఆదుకోవాల్సిన సర్కారు నిండా ముంచేసిందని మున్నేరు వరద బాధితులు మొత్తుకుంటున్నారు. ఇండ్లు మునిగినా.. పంటలు కొట్టుపోయినా.. కట్టుబట్టలతో ఉన్నా.. నష్టప్రభావం తక్కువేనని సర్కారు సాకులు చెప్తున్నదని మండిపడ్డారు. వరద బాధితులను క్యాటగిరీలుగా విభజించి పరిహారం అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని కండ్లారా చూసిన అధికారులు.. వివరాలన్నీ నమోదు చేసుకొని జాబితాలో పేరు కూడా పొందుపర్చారని.. కానీ ఎక్కువ ప్రభావితమైన వారికే అని కొందరి ఖాతాల్లోనే పరిహారం జమ చేస్తున్నారని ఆరోపించారు. నివాసాలు మునిగినా.. తీవ్రత ఉన్న జాబితాలో చేర్చకనే పరిహారాన్ని కోల్పోయామని బోరుమంటున్నారు.
ఆందోళనలో వరద బాధితులు
ఖమ్మం రూరల్ మండలంలో ప్రాథమికంగా 3,800 కుటుంబాలకు నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. క్షేత్ర పరిశీలన తరువాత 2,813 కుటుంబాలు నష్టపోయినట్టు నిర్ధారించారు. ఒకే ఫోన్ నంబర్లు ఇవ్వడం, బ్యాంకు ఖాతాలు లేకపోవడం, ఉన్నా నంబర్లు తెలియకపోవడం వంటి సాంకేతిక కారణాలతో 318కుటుంబాలకు సాయం అందలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ సర్వే జరగని కుటుంబాలు, అర్హత ఉన్నా పరిహారం అందని కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వరుస సెలవుల అనంతరం తెరుచుకున్న ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం వరద బాధితులు వందల సంఖ్యలో చేరుకున్నారు. ఇండ్లు మునిగినా ఘటనను కండ్లారా చూసి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని అధికారులకు మొరపెట్టుకున్నారు. కొందరైతే పూర్తిగా ముంపునకు గురైన ఇండ్లు, ఇతర ఆస్తుల ఫొటోలు తీసుకొచ్చి మరీ అధికారులకు చూపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు ప్రత్యక్షంగా చూసినా పరిహారం ఇవ్వకపోవడంపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి దరఖాస్తులు స్వీకరించారు.
అధికారులు కండ్లారా చూశారు
మా ఇల్లు మునిగిన విషయాన్ని అధికారులు కండ్లారా చూశారు. సర్కారు సాయం చేసే జాబితాలో మా పేరు లేదు. వరద తగ్గిన తరువాత ఒక్కరిద్దరు అధికారులు వచ్చారు. వివరాలన్నీ మా ఇంటి దగ్గరే నమోదు చేసుకున్నారు. కానీ మాకు పరిహారం రాలేదు. సర్కారు సాయం రూ.16 వేలు అందినోళ్లకే స్థానిక నాయకులు రూ.5 వేలు ఇచ్చారు. జాబితాలో పేరు లేదని మాకు అది కూడా రాలేదు.
-అమృతమ్మ, ఆర్టీసీ కాలనీ
మా ఇల్లు పూర్తిగా మునిగింది
మున్నేటి వరదలకు మా కేబీఆర్ నగర్ కాలనీ పూర్తిగా మునిగింది. మా ఇంట్లో దాదాపు రూ.లక్ష వరకూ నష్టం వాటిల్లింది. సర్వే అధికారులు వచ్చి చూశారు. వాళ్లు కూడా చాలా బాధపడ్డారు. కానీ నా ఖాతాలో పరిహారం జమ కాలేదు. ఎందుకని అడిగితే జాబితాలో నా పేరు క్యాటగిరీ-1లో ఉందని సమాధానమిచ్చారు.
-బూడిద వెంకన్న, కేబీఆర్ నగర్
మళ్లీ సేకరిస్తున్నాం..
మున్నేటి వరదలకు మండలంలో ప్రాథమికంగా 3,800 కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగినట్టు తొలుత అంచనా వేశాం. క్షేత్ర పరిశీలన తరువాత 2,813 కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగినట్టు నిర్ధారణ అయింది. ఒకే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, బ్యాంకు ఖాతాల నెంబర్లు ఇవ్వకపోవడం వంటి సాంకేతిక కారణాలతో 318 కుటుంబాలకు పరిహారం రాలేదు. వారి వివరాలు మళ్లీ సేకరిస్తున్నాం.
– రాంప్రసాద్, తహసీల్దార్, ఖమ్మం రూరల్