మహదేవపూర్/కాటారం, మే 3 : అప్పులబాధతో ఎరువుల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపల్లిలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార రాజేందర్ (37) కాటారంలో ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేస్తున్నాడు. తనకున్న ఏడెకరాల వ్యవసాయ భూమిలో మిర్చి, పత్తి సాగుచేశాడు. రైతులకు ఎరువులు ఉద్దెర ఇవ్వడంతో రూ.20 లక్షలదాకా అప్పులయ్యాయి.
తెగుళ్లు ఆశించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు సరిగా రాకపోవడంతో ఉద్దెర తీసుకెళ్లిన రైతులు ఎరువుల డబ్బులు తిరిగి చెల్లించలేదు. బ్యాంకర్లు, అప్పులవాళ్లు డబ్బుల కోసం ఇబ్బందిపెట్టడంతో రుణం చెల్లించలేక మనోవేదన చెందాడు. ఈ క్రమంలో శనివారం మహదేవపూర్ మండలం అయ్యప్ప ఆలయ సమీపంలోని వాటర్‌ట్యాంక్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య స్రవంతి, కూతురు దీప్తి, కుమారుడు అద్విక్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.