ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:42:09

ఫెరారీ కారుతో పరారీ!

ఫెరారీ కారుతో పరారీ!

  • రిజిస్ట్రేషన్‌ ట్రాన్స్‌ఫర్‌లో మాయాజాలం
  • కారు లేకుండానే నకిలీ పత్రాలతో ఓనర్‌ మార్పిడి
  • ఢిల్లీ నుంచి వచ్చి రూ.2 కోట్ల విలువైన కారుచోరీ
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కార్ఖానా పోలీసులు

కంటోన్మెంట్‌: ఇది ఓ కారు కథ.. ఢిల్లీ-హైదరాబాద్‌ మధ్య చక్కర్లు కొట్టిన అత్యంత విలువైన ఓ బుల్లికారు కథ!. కనీసం వాహనాన్ని చూడకుండానే రెండుకోట్ల విలువైన కారును మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన వాస్తవకథ. ఫెరారీతో కారుతో పరారవుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టుచేయటంతో పదిరోజుల క్రితం సుఖాంతమైన కథ. వివరాలోకి వెళితే.. హైదరాబాద్‌లోని మహేంద్రాహిల్స్‌కు చెందిన దివేశ్‌గాంధీ గతేడాది మే నెలలో దాదాపు రూ.2కోట్ల విలువైన కారు(డీఎల్‌ 12సీజే 1111)ను కోయంకోమొబైక్స్‌ కంపెనీ అధినేత జెస్సికా నుంచి కొనుగోలు చేశారు. కారు పత్రాలను తన పేరుమీదకు మార్చుకొనేందుకు రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌కు చెందిన బ్రోకర్‌ నీరజ్‌శర్మను సంప్రదించి సంబంధిత పత్రాలను అప్పగించారు. బైక్‌రేసర్‌ అయిన నీరజ్‌శర్మ మూడునెలలపాటు అమెరికాకు వెళ్లాల్సి రావడంతో కారు రిజిస్ట్రేషన్‌ బాధ్యతను ఢిల్లీలో ఉండే మరో బ్రోకర్‌ ప్రిన్స్‌పాటక్‌కు అప్పగించాడు. ప్రిన్స్‌పాటక్‌ సంతకాలు ఫోర్జరీచేసి ఢిల్లీకే చెందిన బిలాల్‌ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. కారును చూడకుండానే ఢిల్లీ ఆర్టీవో అధికారులు పత్రాలు ట్రాన్స్‌ఫర్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 

కారు కోసం హైదరాబాద్‌కు..

హైదరాబాద్‌లో ఉన్న ఫెరారీ కారును తీసుకురావాలంటూ బిలాల్‌ తన పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఇచ్చి ఢిల్లీనుంచి భూపేందర్‌, సద్దాంను పంపించాడు. జూన్‌ 21న హైదరాబాద్‌కు వచ్చినవారు కారు గురించి ఆరా తీసి కార్ఖానాలోని పీఅండ్‌టీ కాలనీలో నివసించే దివేశ్‌ స్నేహితుడి ఇంటివద్ద ఉన్నదని గుర్తించారు. జూన్‌ 23న రాత్రి 8 గంటల సమయంలో నకిలీ తాళంచెవితో కారును స్టార్ట్‌ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. అదే సమయంలో దివేశ్‌ స్నేహితుడి భార్య గమనించి ఎవరు మీరని ప్రశ్నించారు. దివేశ్‌ స్నేహితులమని, కారు తీసుకురమ్మన్నాడంటూ నమ్మించి తాళంచెవులు తీసుకొని కారుతో ఉడాయించారు. కొద్దిసేపటికే ఆమె భర్త ఇంటికిరాగా, భార్య విషయం తెలిపింది. అతడు దివేశ్‌కు ఫోన్‌చేయగా తానెవరినీ పంపలేదని చెప్పడంతో కారు చోరీకి గురైందని  గుర్తించి కార్ఖానా పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీసీ కెమెరాల ఆధారంగా టోలీచౌకీలో కారు ఉన్నట్టు సీఐ మధుకర్‌స్వామి గుర్తించారు. భూపేందర్‌, సద్దాంను అదుపులోకి తీసుకుని కారును సీజ్‌చేశారు. బ్రోకర్‌, బైక్‌రేసర్‌ నీరజ్‌శర్మను అదుపులోకి తీసుకుని విచారించారు. నకిలీపత్రాలు సృష్టించి కార్లను విక్రయించే ముఠా పనేనని విచారణలో తేలింది. ఆ కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 


logo