Hydraa | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 20 (నమస్తే తెలంగాణ): ‘నాదర్గుల్లో సర్వేనంబర్ 613లో ఉన్నవి ప్రొహిబిటెడ్ భూములు. ఈ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో ఉంచితే దానికి చిన్న ఫుల్స్టాప్, కామా కూడా పెట్టకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో కొనసాగించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులూ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ప్రభుత్వభూములను కాపాడే ప్రయత్నం చేస్తున్న ది.’ఇటీవల మంత్రి పొంగులేటి చేసిన వ్యా ఖ్యలివి.. ఆ భూములు నిషేధిత జాబితాలోనాదర్గుల్ భూములపై 2024లో అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు పంపిన జాబితా (లేఖ నం.ఇ1/4155/2024, తేది:28.10.20 24) ప్రకారం సర్వేనంబరు 613లోని భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా తె లుపుతూ నిషేధిత జాబితాలో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నంబరు 613లో ఉన్న 373.13 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని తెలిపేందుకు ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హైడ్రా మాత్రం ‘వీ డోంట్‌కేర్’ అంటున్నది. ఆ 373.13 ఎకరాల భూములను ప్రైవేటు వారికి చెందినవిగా తీర్పు ఇచ్చేస్తున్నది. దీని వెనుక మర్మమేమిటి? అధికారిక రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రైవేటువని, వాటి జోలికి తాము వెళ్లబోమని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటి? రెవెన్యూ అధికారులు సుప్రీంకోర్టుదాకా వెళ్లి ఆ భూములు సర్కార్‌వేనని న్యాయపోరాటం చేయడంలో ఇక అర్థమేముంటుంది? ఇంతకీ.. నాదర్గుల్లోని 373 ఎకరాల భూములు ప్రభుత్వానివి కా దనేది హైడ్రా మాటలా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయమా? కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములపై సుప్రీంకోర్టులో ప్రారంభించిన న్యాయపోరాటాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తదా? లేక కాడిపారేసి.. హైడ్రాప్రకటనను నిజం చేస్తదా?
చెరువు దగ్గర హైడ్రా ఫెన్సింగ్
నాదర్గుల్లోని సర్వే నంబర్ 613లో భూముల మధ్య లచ్చమ్మకుంట చెరువు ఉంది. ఎఫ్టీఎల్ 17 ఎకరాలు కాగా, ఆరెకరాలు బఫర్‌జోన్. మొత్తం 23 ఎకరాలు. దీని కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు దగ్గర ప్రైవేటు కంపెనీలు రేకుల ప్రహరీ వేసి చెరువులోకి నీళ్లు రానీయకుం డా ఫీడర్ చానల్స్ అన్నీ ధ్వంసం చేశాయి. లచ్చమ్మకుంట నుంచి వరద నీళ్లు నాన్ చెరువు, మర్రివానికుంట, రెడ్డికుంటకు అక్క డి నుంచి సున్నంచెరువు నాలా.. ఆ తర్వాత ఇంజావూర్ మాసం చెరువుకు వరద నీళ్లు పోవాలి. కానీ ఈ చెరువును బంధించి, మూసేయడం వల్ల కింద ఉన్న చెరువులకు వరద నీళ్లు లేకుండాపోయాయి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది నాదర్గుల్లోని లచ్చమ్మకుంట చుట్టూ 17 ఎకరాల పరిధిలో ఫెన్సిం గ్ పనులు మొదలుపెట్టారు. అక్కడ మూసేసిన నాలాలను కూడా తెరిచే పనులు చేపట్టారు. కంపెనీల స్వాధీనంలోని భూమి జోలికి పోకుండా కేవలం ఈ చెరువు చుట్టూ మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నారు. వారం రోజులుగా జరుగుతున్న ఈ పనుల సమయంలో రైతులు మొదటిరోజే అక్కడికి వచ్చి ఈ భూముల్లోకి ఎవరినీ రానీయకుండా ప్రైవేటు వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు సరే.. ఈ భూముల పరిస్థితి ఏమిటని హైడ్రా సిబ్బందిని నిలదీశారు. ఇవి కూడా ప్రభుత్వభూములే కదా అంటూ హైడ్రా ఇన్స్పెక్టర్ను అడిగితే ఆయన అవి ప్రైవేటు భూములని, కోర్టు వివాదంలో ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లేది లేదని చెప్పారు. దీంతో రైతులకు, హైడ్రా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు సరే.. ఇక్కడున్న భూమి మొత్తం ప్రభుత్వానిదే కదా.. మరి ఆ భూములను ఎందుకు కాపాడడం లేదు? అక్కడికి ఎవరూ పోవడానికి వీలు లేకుండా చుట్టూ రేకులు కట్టి, బౌన్సర్లను పెట్టి నడిపిస్తున్నారు. ఆ భూములను ఎందు కు కాపాడరంటూ రైతులు హైడ్రా ఇన్స్పెక్టర్ను అడిగితే.. తాము తవ్వే నాలా పక్కనుంచి లోపలికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చినట్టు తెలిసింది. గతంలోనే నాదర్గూల్లోని ఈ నిషేధిత భూమిని కబ్జా చేస్తున్నారని బయటపెట్టిన ‘నమస్తే తెలంగాణ’.. అప్పుడే అక్కడ ఉన్న చెరువు, గుట్టల కబ్జాపై కూడా కథనాలు ప్రచురించింది. ఆ తర్వాతే మంత్రి పొంగులేటి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వేర్వేరుగా ఈ భూములపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా చెరువు వద్ద హైడ్రా పనులు చేపట్టడంతో మరి ఈ భూములను ఎవరు పరిరక్షించాలనే అంశం చర్చకు వచ్చింది.
నాదర్గుల్లో హైడ్రా తీరిది
కందుకూరు ఆర్డీవో గత ఏడాది మార్చి లో సుప్రీంకోర్టులో వేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నట్టు ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా 373.22 ఎకరాల భూమిపై ప్రభు త్వం న్యాయపోరాటం చేస్తున్నది. మరోవైపు హైడ్రా కమిషనర్ మాత్రం ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవని, అవి న్యాయ వివాదాల్లో ఉన్నాయంటూ కొట్టిపారేశారు. లచ్చమ్మకుంట చెరువు దగ్గర పనులు చేపట్టే క్రమంలో రైతులు కూడా మొత్తం భూమిపై న్యాయస్థానాల్లో కేసు నడుస్తుంది కదా.. మరి ఇక్కడ ఆక్రమణలను ఎందుకు తొలగించరని అడిగితే వారిని బెదిరించినట్టు తెలిసింది. వారు ఫొటోలు తీస్తుంటే హైడ్రా సిబ్బంది అడ్డుకున్నట్టు సమాచారం. చెరువు చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్న హైడ్రాకు ఈ భూమిలో ఉన్న ఆక్రమణలు కనిపించడం లేదా అనే ప్రశ్న తలెత్తుతున్నది. మొత్తం భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించి హైడ్రా పనులు చేయాల్సింది పోయి కేవలం చెరువు వరకే పనులు చేయడం వెనక ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా సిబ్బంది, కమిషనర్ రంగనాథ్ ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.