హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): అమ్మే ఆది గురువు అంటారు. ఇప్పుడు మలిగురువు కూడా అమ్మలే సుస్థిరస్థానం పొందుతున్నారు. పంతులమ్మలుగా అధికంగా అమ్మలే స్థానం సంపాదించారు. దేశంతోపాటు ఇటు రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారిలో అత్యధికంగా మహిళా టీచర్లే ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 63 శాతం మహిళా టీచర్లే ఉండటం గమనార్హం. 2020-21లో రాష్ట్రంలో మహిళా టీచర్ల సంఖ్య 1.92 లక్షలు ఉండగా, 2023-24కు వచ్చేసరికి ఆ సంఖ్య 2.15 లక్షలకు చేరింది. ఇలా ఏటేటా ఉపాధ్యాయ వృత్తిలో మహిళల ఆధిక్యత పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ర్టాల్లో 80-60శాతం మహిళా టీచర్లే ఉన్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మహిళా టీచర్ల ఆధిక్యత ఒక్క మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. జాతీయస్థాయిలో విద్యాబోధనలో మహిళలే ముందు ఉన్నారు. పరిస్థితిని చూస్తుంటే ఉపాధ్యాయ వృత్తి రాబోయే రోజుల్లో మహిళలే అత్యధికంగా వృత్తిలో ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తున్నది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మొత్తం 10 వేల మంది పనిచేస్తుండగా, వీరిలో 8,248 మంది మహిళా టీచర్లే. అంటే 80 శాతం మహిళా టీచర్లే ఉన్నారన్న మాట. అక్కడ పురుషులు 1,989 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
ఢిల్లీలో 1.60 లక్షల ఉపాధ్యాయులు ఉంటే 1.17 లక్షల మంది మహిళా టీచర్లే పనిచేస్తున్నారు. గోవాలో 14 వేల మందికి 11 వేల మంది, కేరళలో 2.91 లక్షల టీచర్లకు, 2.35 లక్షల మంది మహిళలే. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో మహిళలే ఉపాధ్యాయ వృత్తిని ఏలేస్తున్నారు. కొన్ని రాష్ర్టాల్లో మాత్రం ఈ పరిస్థితి మరోలా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో టీచర్ ప్రొఫెషన్లో పురుషులే ఎక్కువగా ఉన్నారు.