కల్వకుర్తి, అక్టోబర్ 15 : ఆకలితో అలమటిస్తున్నామని, వెంటనే వంట వారిని నియమించాలని గురుకుల విద్యార్థినులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని బాలికలు ధర్నాకు దిగారు. తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆవరణలోనే బైఠాయించారు. ‘ఆకలి బాధను తట్టుకోలేకపోతున్నం.. వంట మనుషులను పిలిపించండి.. లేదా మమ్మల్ని ఇంటికి పంపించండి’ అంటూ నినదించారు. ఎమ్మెల్యే వచ్చి తమ బాధలు చూడాలని పట్టుబట్టారు. నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. డీటీడబ్ల్యూవో ఫి రంగి అక్కడికి చేరుకొని విద్యార్థినులకు నచ్చజెప్పినా వినలేదు. తాత్కాలిక వంట సిబ్బందిని చేస్తామని హామీ ఇచ్చారు.