సూర్యాపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘అయ్యా రేవంత్‌రెడ్డీ.. కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయనే నమ్మకంతో 12 ఎకరాల్లో వరి నాటు పెట్టిన. నీళ్లు రాక పదెకరాలు ఎండిపోయి అప్పులు మిగిలాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.. లేదంటే సచ్చేందుకు పురుగుల మందైనా ఇవ్వాలి’ అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామానికి చెందిన మహిళా రైతు కొనకంచి కళమ్మ చేతులు జోడించి వేడుకుంటున్నది. ఎండిన పొలాన్ని గొర్రెల మేతకు అప్పగించిన ఆమెను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. ఈ సందర్భంగా కళమ్మ పుట్టెడు దుఃఖంతో కండ్లల్ల నీళ్లు దీస్తూ తన గోడు వెళ్లబోసుకున్నది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘ఆరేండ్ల కిందటి వరకు బీడుగా ఉన్న భూమిలో కేసీఆర్ నీళ్లతో వరుసగా కడుపు నిండా పంటలు పండించిన. అడ్డమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ మాయదారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల నీళ్లు ఇస్తలేదు. ప్రతిసారి లెక్కనే ఈ సారి కూడా నీళ్లు వస్తాయనే నమ్మకంతోనే 12 ఎకరాల్లో వరి నాటు పెట్టినం.
నీళ్లు రాక 10 ఎకరాల్లో పంటంతా ఎండిపోయింది. పొట్టదశకు వచ్చిన వరిని కాపాడుకునేందుకు ఉన్న పుస్తెలతాడు తాకట్టు పెట్టి రెండు బోర్లు వేస్తే చుక్కనీరు కూడా పడలేదు. పెట్టుబడికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చయ్యింది. గత్యంతరం లేక ఎకరం పొలం రూ.1,500 లెక్కన గొర్ల మేతకు వదిలిపెట్టినం. ఈ యాసంగికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ముందు చెప్తే ఎలగటి పంటలైనా వేసుకునేవాళ్లం. ఓటేసి గెలిపించినందుకు రైతులను నట్టేట ముంచుతున్నడు. ఇలాంటి దరిద్రపుగొట్టు ప్రభుత్వం వస్తుందనుకోలేదు. మా ఇంట్లో నలుగురి పేరిట పాస్ పుస్తకాలు ఉంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని వాళ్లు వెంటనే వెళ్లి రెండు లక్షల లోపు తీసుకోవాలని రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల ముందు చెప్తే రుణం తీసుకున్నాం. పైసా మాఫీ కాలేదు. రుణమాఫీనే కాదు.. కేసీఆర్ ఇచ్చిన నీళ్లను కూడా అడ్డుకుంటున్నరు. రైతులపై ఎందుకింత కక్ష? ఓ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. దయచేసి ఎండిన వరి పొలానికి పరిహారం ఇయ్యండి. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందైనా ఇవ్వండి. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. ఏదైనా ఒకటి ఇవ్వండి’ అంటూ కళమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.