తొర్రూరు, ఏప్రిల్ 21: ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు ఎండదెబ్బతో హఠాన్మరణం చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో సోమవారం చోటుచేసుకున్నది. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని స్వగ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వసతులు కల్పించకపోవడంతో రైతు మృతి చెందినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన హనుమాండ్ల వెంకట్రామ్ నరసయ్య, ప్రేమలత (58) దంపతులు. వీరు తమకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి సాగు చేశారు. నాలుగు రోజుల క్రితం కోత పూర్తయిన అనంతరం ధాన్యాన్ని వడ్ల కొనుగోలు కేంద్రానికి తరలించి రాశులు పోశారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వడ్లు నేర్పుతుండగా ప్రేమలత అకస్మాత్తుగా ఎండ దెబ్బకు గురై అకడికక డే కుప్పకూలిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీళ్లు, నీడకు టెంటు, గ్లూకోజ్ లాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రేమలత మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించినట్టు ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రేమలతది ప్రభుత్వ హత్యేరైతు ప్రేమలత మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమలతది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఉండేవని, రైతులకు రక్షణ కల్పించేదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చర్లపాలెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీళ్లు, నీడ, వైద్యానికి సంబంధించి ఎటువంటి వసతులు కల్పించలేకపోవడంతో ఎండదెబ్బతో ప్రేమలత మరణించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులను రక్షించే చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనల బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.