ధరూరు, ఫిబ్రవరి 7: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందించింది. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొన్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న కేటీదొడ్డి మండలానికి చెందిన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆవేదనే అందుకు నిదర్శనం. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో భోజనంలో మెనూ పాటించడం లేదని, సగం సగం భోజనం పెట్టడంతో కడుపు మాడ్చుకొని చదవుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఓపిక నశించిన విద్యార్థులు.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కాలినడకన కలెక్టరేట్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్ ధరూరు మండల కేంద్ర శివారులో విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలను ఎస్సై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిణి శ్వేతాప్రియదర్శిని, ఎంఈవో సురేశ్‌లు అక్కడికి చేరుకొని విద్యార్థులతో బూరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో చర్చలు జరిపారు. ఇప్పటినుంచి మెనూ ప్రకారం కడుపునిండా భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు తిరిగి పాఠశాలకు చేరుకున్నారు.