హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీ యాజమాన్యాలు ఇచ్చిన నిరవధిక బంద్ పిలుపునకు సర్కారు దిగి వచ్చింది. వెంటనే బకాయిల విడుదలకు అంగీకరించింది. వారంలో రూ.600 కోట్లు, దీపావళికి మరో రూ.600 కోట్లను విడుదల చేస్తామని హామీనిచ్చింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్‌ను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రతినిధులతో సర్కారు సోమవారం మరోసారి చర్చలు జరిపింది. ప్రజాభవన్‌లో జరిగిన ఈ చర్చల్లో తొలుత అధికారులు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు.
ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది క్రితం టోకెన్లు జారీచేసిన పెండింగ్ బకాయిలు రూ.1207 కోట్లను విడుదల చేయాలని యాజమాన్యాలు కోరాయి. అంత ఇవ్వలేమని సర్కారు చెప్పడంతో ప్రొఫెషనల్ కాలేజీలకు రూ.500కోట్లు, డిగ్రీ కాలేజీలకు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.700 కోట్ల బకాయిలను విడుదల చేయాలని యాజమన్యాలు పట్టుబట్టాయి. అయితే ఈ వారంలో రూ.600 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీనిచ్చింది. దీంతో కాలేజీల నిరవధిక బంద్‌ను విరమిస్తున్నట్టు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.
తొలిరోజు కాలేజీలకు తాళాలు
యాజమాన్యాలు చేపట్టిన కాలేజీల బంద్ తొలిరోజు విజయవంతమైంది. బంద్ సందర్భంగా యాజమాన్యాలు కాలేజీలకు తాళాలు వేశాయి. గేట్లు కూడా తెరవలేదు. కాలేజీల బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. దాదాపు 750కి పైగా కాలేజీలు బంద్ పాటించాయి. కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు సైతం బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా యాజమాన్యాలు బ్యానర్లు ప్రదర్శించి నిరసన తెలిపాయి. గత్యంతరం లేకే తాము బంద్‌కు పిలుపునిచ్చామని, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించాలని కోరుతూ కాలేజీల గేట్ల ఎదుట పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించాయి.