Telangana | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల పరీక్షల ప్రాథమిక ‘కీ’ అభ్యంతరాలపై ఇకనుంచి ఫీజులు వసూలు చేస్తారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు. ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తంచేసిన పక్షంలో ప్రాథమిక కీలో వెల్లడించిన ఆన్సర్ తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఆన్సర్లో మార్పులేకపోతే మాత్రం ఫీజు వాపస్ ఇవ్వరు. 2025-26లో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలు(సెట్) కన్వీనర్ల సమావేశాన్ని మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సహా పలు సెట్ల కన్వీనర్లు హాజరయ్యారు.
పలువురు ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ఉన్నత విద్యామండలి ఆమోద ముద్రవేయాల్సి ఉంది. ఈ విధానం ఇప్పటికే జేఈఈ, నీట్లో అమలవుతున్నది. ఒక్కో ప్రశ్నపై అభ్యంతరాలకు రూ. 200 ఫీజుగా తీసుకుంటున్నారు. ఈ ఫీజు నాన్ రీఫండబుల్. ఎప్‌సెట్ సహా పలు ప్రవేశ పరీక్షల ప్రాథమిక ‘కీ’లపై భారీగా అభ్యంతరాలొస్తున్నాయి. కొన్ని కాలేజీలు కావాలనే విద్యార్థుల చేత భారీగా అభ్యంతరాలు నమోదు చేయిస్తున్నట్టుగా తేలింది. అందుకే అభ్యంతరాలు వ్యక్తంచేసేందుకు ఫీజు పెడితే, విద్యార్థులు కొంత ఆలోచించే అవకాశముంటుందని, అభ్యంతరాలు తగ్గుతాయని అధికారులు అంచనావేస్తున్నారు.