Home Guards | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హోంగార్డులకు ఇవ్వాల్సిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి, దాదాపు రూ.47 కోట్లు రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ నాటికి కూడా అందలేదు. సాధారణంగా హోంగార్డులకు నాలుగు నెలలకు ఒకసారి వేతన నిధులను ఆర్థికశాఖ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన నిధుల్లో ఫిబ్రవరికి అందాల్సిన సుమారు రూ.47 కోట్లను అత్యవసరంగా రైతు భరోసాకు మళ్లించిన నేపథ్యంలో వేతనాలు మరింత ఆలస్యమవుతాయని తెలుస్తున్నది.
రెండు నెలలకు ఒకసారి వేతనం వస్తుండటంతో హోం గార్డులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 11వ తేదీ నాటికీ వేతనం పడకపోవడంతో.. 10వ తేదీకి పెట్టుకున్న ఈఎంఐలను చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నెలవారీ ఫీజుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని, కుటుంబపోషణ భారంగా మారిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 16 వేల మంది హోంగార్డుల వేతనాలను రైతు భరోసాకు ప్రభుత్వం మళ్లించిందని తెలిసి మరింత ఆవేదనకు లోనవుతున్నారు.