హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): బర్డ్‌ఫ్లూ భయంతో జనం బెంబేలెత్తుతున్నారు. కోడి మాంసం, గుడ్ల వినియోగాన్ని మానుకుంటున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించడంతోపాటు కోడి మాంసం, గుడ్ల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ జీ రంజిత్‌రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. పౌల్ట్రీ ఉత్పత్తులు సురక్షితమైనవేనని, ఎలాంటి భయం లేకుండా వాటిని వినియోగించవచ్చని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించేందుకు వెంటనే తగిన ఉత్తర్వులు జారీచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎంను కలిసినవారిలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్)కు చెందిన కే మోహన్‌రెడ్డి, వీ భాస్కర్‌రావు, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్)కి చెందిన జీ చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (టీపీబీఏ)కి చెందిన జీ రమేశ్‌బాబు, డీ రాంరెడ్డి, కేజీ ఆనంద్, పౌల్ట్రీ ఇండియాకు చెందిన ఉదయ్ సింగ్ బయాస్, సంజీవ్ చింతావర్ ఉన్నారు.