Green Field road | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సామాన్యుడి కంటి మీద కునుకు కరువైంది. నగరంలో హైడ్రా, మూసీ కూల్చివేతలతో సామాన్య ప్రజలను హడలెత్తించిన రేవంత్ సర్కారు… శివారు ప్రాంతాల్లో భూసేకరణ పేరిట రైతులను వెంటాడుతున్నది. ఒకవైపు, ఫార్మా భూముల రైతులు కొన్ని నెలలుగా ఇల్లూ వాకిలి వదిలి ఆందోళనబాట పట్టారు. తాజాగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు బాధిత రైతులు సైతం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే వంద అడుగులతో విశాల రహదారులు ఉన్నప్పటికీ, ప్రధానంగా మాడ్గుల మీదుగా ఆకుతోటపల్లి వరకు ఏకంగా 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతున్నది.
వాస్తవానికి, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను ఆర్అండ్బీ చేపట్టాల్సి ఉండగా… ప్రత్యేకంగా హెచ్ఎండీఏతో ఈ రోడ్డును మాత్రం యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. రహదారి నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించకుండా నిర్దయగా వ్యవహరిస్తున్నది. రైతులు హైకోర్టును ఆశ్రయించి తమ భూముల్లో రోడ్డు వేయకుండా స్టే తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. రేపోమాపో నిర్మాణ పనులు కూడా మొదలుకానున్నాయనే సమాచారంతో బాధిత రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నష్టపరిహారంపై రైతుల్లో ఆందోళన
రవాణా వ్యవస్థ విస్తరణ అంచెలంచెలుగా జరగాలి. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ తొలుత ఇన్నర్ రింగు రోడ్డు, ఆపై అవుటర్ రింగు రోడ్డు వచ్చాయి. నగరం విస్తరించడం, ట్రాఫిక్ పెరగడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రేడియల్, లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్)పై కూడా కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను అనుసంధానిస్తూ గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వీటిని చేపట్టడంలో అర్థముంది. కానీ, ఆర్అండ్బీ ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్లన్నింటినీ పక్కనపెట్టి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపైనే దృష్టంతా పెట్టింది.
మాడ్గుల కేంద్రంగానే ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారనే రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ, ఫ్యూచర్ సిటీ కోసం చేపడుతున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఈ నేపథ్యంలో రావిర్యాల (ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13) నుంచి ఆకుతోటపల్లి వరకు 330 ఫీట్ల వెడల్పుతో 41 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. యుద్ధప్రాతిపదికన సర్వే చేసి, హద్దులు కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగా సుమారు వెయ్యి ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో టీజీఐఐసీకి చెందిన 202 ఎకరాలు, ఉండగా, అటవీ శాఖ భూములు 231 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన దాదాపు 600 ఎకరాల వరకు సుమారు 4 వేల మంది రైతులకు చెందిన పట్టా భూములు ఉన్నాయి. హైదరాబాద్ విస్తరణతో ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.కోట్లల్లో పలుకుతున్నది. దీంతో సాధారణంగా ఆయా రైతు కుటుంబాలు నష్టపరిహారంపై తీవ్ర ఆవేదన చెందడం సహజం. రైతులను పిలిచి సంప్రదింపులు జరిపి వారికి సంతృప్తికరంగా పరిహారాన్ని నిర్ధారించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం రైతులను ఆవేదనకు గురిచేస్తున్నది.
టెండర్ల పూర్తితో రైతుల్లో దడ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకపోగా… కనీసం హైకోర్టు స్టేను కూడా ఖాతరు చేయడం లేదు. ఏకపక్షంగా ముందుకుపోతూ 41 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు కూడా పూర్తి చేసింది. మొదటిది దశలో అవుటర్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 19 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి రూ.1,665 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి పనులు దక్కాయి. రెండో విడతగా మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర చేపట్టే పనులకు రూ.2,365 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా ఎల్అండ్టీకి పనులు దక్కాయి.
ఈ మేరకు హెచ్ఎండీఏ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఒప్పందానికి రంగం సిద్ధం చేసింది. . నష్టపరిహారంపై ప్రభుత్వం కనీసం చర్చలు జరపకుండా, తమ ఆవేదనను పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా ఇలా పనులకు సిద్ధమవడంపై రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఇప్పటికే పరిహారం తీసుకోని ఫార్మా బాధిత రైతులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారు. వారికి చెందిన పరిహారాన్ని ప్రభుత్వం కోర్టులో డిపాజిట్ చేసి భూములను స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసింది. దీంతో తమ భూములపై పరిహారాన్ని కూడా కోర్టులో డిపాజిట్ చేసి కనీసం తమను లెక్కలోకి తీసుకోకుండానే ప్రభుత్వం పనులను మొదలుపెట్టడం ఎంతవరకు న్యాయం? అంటూ రైతులు లబోదిబోమంటున్నారు.