అహ్మదాబాద్, నవంబర్ 13: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. టికెట్లు దక్కని పలువురు సీనియర్లు రెబల్స్‌గా రెడీ అవుతుండటం కమలం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. డజన్‌కు పైగా స్థానాల్లో పార్టీ సీనియర్ నేతలు స్వతంత్రులుగా పోటీకి సిద్ధపడటం అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నది. బీజేపీ ఇప్పటి వరకు 166 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకతను తగ్గించడానికి పలువురు సీనియర్లను పక్కనపెట్టి కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది.
40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా సీనియర్ మంత్రులకు సైతం బీజేపీ ఈ సారి టికెట్లు ఇవ్వలేదు. వడోదరలోని వఘోడియా నుంచి ఆరు సార్లు గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరో ఇద్దరు నేతలు కూడా పార్టీతో పోరుకు సై అంటున్నారు. కొత్త ముఖాలను తీసుకురావడానికి, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించడం సొంత పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది. స్థానిక ప్రాంతాల్లో నిరసనలు చేపట్టిన నాయకులు గాంధీనగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. అసంతృప్త నేతలు కొందరు తమ మద్దతుదారులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇలా రాష్ట్రంలో డజనుకుపైగా ప్రాంతాల్లో పార్టీ సీనియర్ నేతలే స్వతంత్రులుగా బరిలో నిలవడానికి సిద్ధపడటంతో బీజేపీకి ఓటమి వణుకు మొదలైంది.