హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లలో కోతలు తప్పవా? రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదా? అంటే ఔను అనే అంటున్నాయి సివిల్‌సప్లయ్ వర్గాలు. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లలో భారీ కోత పెడుతున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర సవిల్ సప్లయ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. వానకాలం ధాన్యం కొనుగోళ్లపై ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున కొనుగోలు చేసే ధాన్యం వివరాలను రాష్ట్ర అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. ఒకవేళ ఈ సీజన్లో 52 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలనే నిర్ణయం ఫైనల్ అయితే… రాష్ట్రంలో రైతుల నెత్తిన పిడుగు పడినట్టే అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కోటి టన్నులు కొనుగోలు చేసేదెవరు?
ఈ వానకాలంలో ఇప్పటివరకు 66 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన ఎకరానికి సగటున 23 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిని అంచనా వేసినా 151 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. ఇందులో సర్కారు 52 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై సివిల్ సప్లయ్ అధికారులు స్పందిస్తూ… ఇది చాలా తక్కువ లక్ష్యమని, దీనిని పెంచాలని కోరినట్టు తెలిసింది. దీనిపై ఎఫ్‌సీఐ అధికారులు స్పందిస్తూ.. ‘ముందు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయండి.. ఒకవేళ ఇంకా వస్తే అప్పుడు చూద్దాం’ అని అన్నట్టు తెలిసింది. దీంతో రైతులు పండించిన మిగిలిన సుమారు కోటి టన్నుల ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ సర్కారు వైఫల్యమేనా?
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, వైఫల్యం రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ధాన్యం కొనుగోళ్ల టార్గెట్‌ను తక్కువగా పెట్టడానికి కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సర్కారు పక్కా ప్రణాళికతో వ్యవహరించి కేంద్రానికి నివేదికలు పంపిస్తే కొనుగోలు లక్ష్యం ఇంత తగ్గేదికాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సాగు లెక్కల ప్రకారం ఈ సీజన్లో ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేస్తే 90 లక్షల టన్నుల నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాలున్నాయి. రైతులు పండించే మొత్తం 150 లక్షల టన్నుల ధాన్యంలో 30 లక్షల టన్నులు మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసినా, మరో 20 నుంచి 25 లక్షల టన్నులు రైతులు తమ అవసరాలకు నిల్వ చేసుకుంటే మిగిలిన కోటి టన్నులు సర్కారు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాంటిది 52 లక్షలకే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీని తూతూ మంత్రంగా అమలుచేస్తున్న సర్కారు.. దీని నుంచి తప్పించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలం బోనస్ పైసలను మూడు నెలల తర్వాత చెల్లించిన సర్కారు.. మొన్నటి యాసంగి బోనస్ పైసలను ఇప్పటివరకూ చెల్లించలేదు. సుమారు రూ.1,200 కోట్ల బకాయిలున్నాయి. బోనస్ వస్తుందన్న ఆశతో ఈ వానకాలంలో రైతులు భారీగా సన్నాలు సాగు చేశారు. సుమారు 60% సన్నాలు సాగు చేసినట్టు అంచనా. దీంతో కొనుగోలు కేంద్రాలకు సుమారు 40-50 లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వం బోనస్ కింద రైతులకు రూ.2వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బకాయిలు రూ.1,200 కోట్లు చెల్లించలేక ఆపసోపాలు పడుతున్న సర్కారు.. రూ.2వేల కోట్లు చెల్లించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లలో కోత పెడితే… బోనస్ భారం తగ్గించుకోవచ్చనే ఆలోచనలో సర్కారు ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కేంద్రం 52 లక్షల టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపితే, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.