హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): నిజాం నవాబు మీర్ ఉ స్మాన్ అలీఖాన్ బహదూర్ (7వ నిజాం)కు అసలైన వారసురాలిని తానేనంటూ ఆయన మనవరాలు ప్రిన్సెస్ ఫాతిమా ఫౌజియా కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో నివసిస్తున్న మిలాద్ అలీఖాన్, నాంపల్లికి చెందిన సాజిద్ అలీఖాన్, బంజారాహిల్స్లో నివసిస్తున్న మీర్ మిర్జా అలీఖాన్ 2016లో ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ పత్రాలతో కోర్టును మోసగించి నిజాం వారసులుగా సర్టిఫికెట్ను పొందారని ఫిర్యాదు చే శారు. సర్టిఫికెట్ను రద్దు చేయాలని, నిజాం ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్న ఆ ముగ్గురిని అరెస్టు చేయాలని కోరారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం 7వ నిజాంకు దుల్హాన్ పాషా ఒక్కరే భార్య అని ఫాతిమా తెలిపారు. ఆమె కాకుండా 7వ నిజాం భార్యలుగా చెప్పుకుంటున్నప్పుకుంటున్న ఇతరులకు చట్టప్రకారం ఎలాంటి అర్హత లేదని పేర్కొన్నారు. కాగా, తమిళనాడులోని ఉదగమండలం, నీలగిరి, ఊటీలో నిజాం నవాబుకు ఉన్న రూ.121 కోట్ల విలువైన ఎస్టేట్లో తనకు వాటా ఇప్పించాలని గతంలో ఫాతిమా పోరాటం చేయడంతో తండ్రి, సోదరుడి నుంచి 36% వాటా వచ్చింది. ఆ వాటాను తక్కువగా చూపిస్తూ పూర్తి ఎస్టేట్ను కాజేసేందుకు మిలాద్ అలీఖాన్, సాజిద్ అలీఖాన్, మీర్ మీర్జా అలీఖాన్ కుట్ర చేస్తున్నారని ఫాతిమా ఆరోపించారు. ఈ విషయమై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులపై కేసు నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హై డెఫినిషన్ పవర్లైన్ కమ్యూనికేషన్లో అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న పానాసోనిక్తో టీ హబ్ ఒ ప్పందం కుదుర్చుకుందని టీహబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. నెస్సమ్ హెచ్డీ-పీఎల్సీ టెక్నాలజీ ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైనదని చెప్పారు. పానాసోనిక్ హోల్డింగ్ చీఫ్ ఇంజినీర్ కొటారో టామాత్సువో మాట్లాడుతూ.. ఇండియాలో తమ సంబంధాలు మరింత పెంచుకోవడానికి టీ హబ్ బలమైన పునాది వేస్తుందని తెలిపారు. పానాసోనిక్ ఆధునాతన నెస్సమ్ టెక్నాలజీని ఉపయోగించి జపాన్, ఇండియా టెక్నాలజీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మనీషా మిశ్రా పాల్గొన్నారు.