హైదరాబాద్ సిటీబ్యూరో/బడంగ్పేట్, జూన్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మీర్పేట్.. పేఅండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు(59) ఇంట్లోని సంపులో శవమై కనిపించాడు. కాళ్లు, చేతులను తాళ్లతో కట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇంట్లోనే ఉండే భార్య, కుమారుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే పోలీసులు ఆగమేఘాలపై ఇది ఆత్మహత్య అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. విజయవాడలో ఉండే కూతురు వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే మీర్పేట్లోని సాయిప్రభు హోమ్స్ కాలనీలో నివాసముండే వెంకటేశ్వరరావు (59) పే అంట్ అకౌంట్స్ అఫీసర్గా పనిచేసేవాడు. ఆయనకు భార్య జయంతి, కొడుకు భరత్రాజు, కూతురు ధరణిదేవి ఉన్నారు. ఆయన మరో రెండేండ్లలోపు రిటై ర్డ్ కానున్నారు.
కొన్ని నెల ల క్రితం కూతురు ఇంటికి వచ్చిన సందర్భంగా ఆస్తి విషయంలో గొడవలు జరిగినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తనకు కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉం దని, డబ్బు, ఉద్యోగం గురించి వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో నిద్రపోయేటప్పుడు కూడా వెంకటేశ్వర్రావు దిండు కింద కత్తి పెట్టుకుని పడుకునేవాడని స్థానికులు చెప్తున్నారు. ఇంట్లో ఉండలేక ప్రభు త్వ క్వార్టర్స్లోకి మూడు రోజుల్లో షిఫ్ట్ అయ్యేందుకు వెంకటేశ్వర్రావు అంతా సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో సంపులో శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హడావుడిగా ఆత్మహత్య అని ప్రకటించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్వర్రావు ఫిర్యాదుపై విచారిస్తే పరిస్థితి ఇలా జరిగితే కాదంటునారు.