వెల్దండ, సెప్టెంబర్ 3 : కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వచ్చిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. అయితే ముగ్గురు పిల్లల ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లికి చెందిన గుప్తా వెంకటేశ్వర్లు (35), దీపిక దంపతులు. వీరికి కుమార్తెలు మోక్షిత(8), వర్షిణి(6), కుమారుడు శివధర్మ ఉన్నారు. భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆగస్టు 30న ముగ్గురు పిల్లలను తీసుకొని వెంకటేశ్వర్లు బైక్పై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల కిందట డిండి పరిసర ప్రాంతాల్లో పిల్లలతో కలిసి తిరిగినట్టు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో విగత జీవిగా పడి ఉన్నా డు. అయితే అతడి వెంట వచ్చిన ముగ్గురు పిల్లలు ఎక్కడికి వెళ్లారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హాజీపూర్ గేటు వద్ద బంక్లో పెట్రోల్ పోయించుకున్న సమయంలో పిల్లలను బైక్పై నుంచి దింపి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు భార్య దీపిక ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేయగా.. వెల్దండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.