దామరచర్ల, డిసెంబర్ 24 : ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నూనావత్ తండా లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. కు టుంబ కలహాల కారణంగానే ఆ వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తున్నది. వాడపల్లి పోలీసుల కథనం ప్రకా రం.. దామరచర్ల మండలం నూనావత్ తండాకు చెందిన గేరి కిషన్ (35)కు అదే తండాకు చెందిన భూలక్ష్మితో పదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి హర్షవర్ధన్ (8), అఖిల్ (6) అనే ఇద్దరు కుమారులు. కిషన్ ఆటో నడపడంతోపాటు తమకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కొడుకు మూడోతరగతి, చిన్నకొడుకు రెండో తరగతి చదువుతున్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. దుస్తులు, తినుబండారాలు కొనిస్తానని తండ్రి కిషన్ వారిని బయటకు తీసుకెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్ల వెతికినా జాడ తెలియరాలేదు. శుక్రవారం ఉదయం పొలం వద్ద ముగ్గురి మృతదేహాలను చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలం వద్ద మజా బాటిల్ కన్పించింది. అందులో పురుగుమందు కలిపి పిల్లలకు తాగించి వారు చనిపోయాక కిషన్ చెట్టుకు ఉరి వేసుకున్నట్టు తెలుస్తున్నదని పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.