సిద్దిపేట టౌన్, నవంబర్ 10: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనార్యోగ సమస్యలతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీకి చెందిన తేలు సత్యం (48) సిద్దిపేటలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. 2016లో శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు అద్వేశ్నంద (8), కూతురు త్రివన్నహాసిని (6) ఉన్నారు. సత్యం ఇటీవల అనార్యోగంతో బాధపడుతూ.. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తన తమ్ముడు శ్రీనివాస్ నుంచి రూ.5.50 లక్షలు రావాల్సి ఉండగా.. ఇవ్వాలని అడిగాడు.
ఇందుకు శ్రీనివాస్ సత్యంపై దాడిచేసి డబ్బులు ఇవ్వనని బెదిరించాడు. ఇలా కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో తీవ్ర మనోవేదన చెందిన సత్యం శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య శిరీష అంతటా వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. చివరికి ఆదివారం తెల్లవారుజామున చింతల చెరువు కట్టపైన సత్యం బైక్, ఫోన్ కనిపించింది. వాటి ఆధారంగా చెరువులో చూస్తే ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. గుర్తుపట్టిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉపేందర్ ఘటనా స్థలానికి చెరుకుని గజ ఈతగాళ్లతో చెరువులోని మృతదేహాలను బయటకు తీశారు. తన మరణానికి గల కారణాలను సెల్ఫీ వీడియో తీసి, సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు.