నవీపేట,ఏప్రిల్ 27 : కూతురు పెండ్లి కోసం మేకల విక్రయాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. నందిగామకు చెందిన గొర్రెల కాపరి ఎల్క దేవన్న(51)కు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. 130 మేకలు, గొర్రెలు ఉన్నాయి. కూతురి పెండ్లి ఖర్చుల కోసం 30 మేకలను విక్రయించాడు. ఈ నెల 26న నస్రుల్లాబాద్ మండలం అంకోలి గ్రామంలో ఘనంగా పెండ్లి చేసి సాయంత్రం ఇంటికి వచ్చాడు.
ఇంటి వద్ద 130 మేకల మందలో నుంచి 30 మేకలు తగ్గిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మద్యం తాగి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెండ్లి కూతురు ఇంటికి వచ్చే సరికే తండ్రి విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కూతురు పెండ్లి రోజే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.