వీర్నపల్లి, జూలై 6 : ఒక్కగానొక్క కూతురు ఏండ్లకేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. పైగా వైద్యానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందాడు. చివరకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజవ్వ, పోచయ్య (65) దంపతులు. వీరికి ఓ కూతురు ఉన్నది. అమ్మాయికి ఐదేండ్ల వయస్సు వచ్చేసరికి అనారోగ్యం వెంటాడింది.
దవాఖానకు తీసుకెళ్తే మధుమేహం ఉన్నట్టు బయటపడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా ఆమె అనారోగ్యం బారిన పడటంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.అప్పటి నుంచి వైద్యం చేయిస్తూనే ఉన్నాడు. చికిత్స కోసం ఎకరన్నర పొలం అమ్మాడు. అయినా నయం కాకపోవడంతో తెలిసిన వారి వద్ద రూ.5 లక్షల దాకా అప్పు చేసి మరీ కూతురు వైద్యానికి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి 25 ఏండ్లు. రోజులు గడిచినా కూతురు ఆరోగ్యం కుదుట పడకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పోచయ్య కలత చెందాడు. ఆదివారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.