కరీమాబాద్, జనవరి 26 : వరంగల్ జిల్లా మామునూరులో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన సంతోష్, అతడి భార్య చామాబాయి, కుమారులు ముకేశ్, కన్నా, కుమార్తెలు పూజ, కిరణ్ కొంతకాలంగా మామునూరులో కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పొట్టకూటి కోసం తమ సామగ్రిని సర్దుకొని ఆదివారం మామునూరు నుంచి ఆటోలో వరంగల్ వైపు బయలదేరారు. అదేవైపుగా ఇనుప స్తంభాల లోడుతో వైజాగ్ నుంచి రాజస్థాన్‌కు ఓ భారీ లారీ వెళ్తున్నది. మామునూరు బెటాలియన్ సమీపంలోకి రాగానే లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న ఇనుప స్తంభాలు అదే దారిలో వెళ్తున్న రెండు ఆటోలపై పడి నుజ్జునుజ్జు అయ్యాయి. ఒక్కసారిగా ఇనుప స్తం భాలు పడడంతో ఏడుగురితో ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన సంతోష్ (48), పూజ (20), కిరణ్ (20), కన్నా (7) అక్కడికక్కడే మరణించగా, ముకే శ్, ఆటో డ్రైవర్లు షకీర్, సాగర్ గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాలను ఎంజీఎం ఎంజీఎం దవాఖానకు తరలించారు. గాయపడిన వారి ని కలెక్టర్ సత్యశారదాదేవి, సీపీ అంబర్ కిశోర్ ఝా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి పరామర్శించారు.