షాబాద్, డిసెంబర్ 2: రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైకి లారీ దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ వద్ద చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరు, నాంచేరు అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్‌కు చెందిన 25 మంది ఆలూరు గేట్ సమీపంలోని రోడ్డు పకన కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం కూరగాయలు అమ్ముతుండగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వస్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన నకలపల్లి రాములు(40), దామరిగిద్ద కృష్ణ(22), ఇంద్రారెడ్డినగర్‌కు చెందిన ఎస్ సుజాత(42) అకడికకడే మృతిచెందారు. వీరితో పాటు సెంట్రింగ్ పనిమీద సూటీపై వచ్చి ఆలూరు వద్ద టీ తాగేందుకు ఆగిన టోలిచౌకికి చెందిన జమీల్(26)ను ఢీకొట్టడంతో అతను కూడా స్పాట్లోనే చనిపోయాడు. వీరితో పాటు ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన పద్మమ్మ, ఆలూరుకు చెందిన బాలమణి, అక్కడే జామకాయలు విక్రయిస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన చల్లా మాల్యాద్రికి తీవ్ర గాయాలయ్యయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలు , క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదంలో బండ్లగూడకు చెందిన లారీ డ్రైవర్ అమీర్ క్యాబిన్ ఇరుకోవడంతో అతడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు బయటికి తీసి ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సబితారెడ్డి, బీఆర్ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. దవాఖానకు చేరుకుని గాయపడిన వారితో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీజాపూర్ హైవే విస్తరణ పనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం చేవెళ్ల బీజాపూర్ రహదారి రోడ్డు పనులను వెంటనే పూర్తిచేయాలని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. ఆదివారం చేవెళ్ల బీజాపూర్ రహదారి మీర్జాకూడా గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతికి ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చేవెళ్ల పోలీసు స్టేషన్లో సీఐ శ్రీధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పా నుంచి మాన్నెగూడ వరకు 4లేన్ల రోడ్డు మంజూరై ఏడాదిన్నర అయినా పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు.