హైదరాబాద్ : పోలీస్ అధికారులు ప్రజాకేంద్రీకృత పోలీసింగ్ (సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్) కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం డీజీపీ కార్యాలయంలో కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ డీజీపీ డాక్టర్ జితేందర్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా 14 నెలలపాటు పనిచేసినందుకు గర్వపడుతున్నానని అన్నారు.
విధి నిర్వహణలో తాను ప్రజా కేంద్రీకృత పోలిసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. పోలీస్ సిబ్బంది సైతం సామాన్య ప్రజలలో భాగస్వాములు కాబట్టి వారిని కేంద్రీకృతంగా చేసుకొని పలు రకాల చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. పోలీస్ సిబ్బంది, అధికారుల కృషివల్ల తాను డీజీపీగా ఉన్నప్పుడు ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్‌గా పేరు తెచ్చుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ చిత్తశుద్ధితో పనిచేసి తెలంగాణ పోలీస్ శాఖ స్థాయిని కొనసాగించాల్సి ఉందని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలీస్ సిబ్బంది మరింత మెరుగ్గా రాణిస్తున్నారని డీజీపీ జితేందర్ చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖకు ప్రధాన కార్యాలయంగా ఉన్న డీజీపీ కార్యాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని అన్నారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ శ్రీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీగా తాను, డీజీపీ జితేందర్ ఒకేరోజు ఉద్యోగ బాధ్యతలు బాధ్యతలు స్వీకరించామని తెలిపారు.
డీజీపీ తన విధి నిర్వహణలో భాగంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల మీట్, యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు, టూరిజం పోలీస్, ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం తెలంగాణకు ప్రథమ స్థానం వంటి ఎన్నో చర్యలు చేపట్టారని తెలిపారు. మల్టీజోన్ల ఐజీపీలు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, తఫ్సీర్ ఇక్బాల్, ఐజీపీలు ఎం రమేష్, రమేష్ నాయుడు, ఎం శ్రీనివాసులు, సీఐడీ ఎస్పీ నవీన్ కుమార్, డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షులు సీ పవన్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి హరిణి, కల్చరల్ సెక్రెటరీ శ్రీమతి శివరంజని, అధికారులు, సిబ్బంది తదితరులు ఈ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు.