రంగారెడ్డి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా రైతులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఫార్మాసిటీ (Pharma City) భూసేకరణలో భాగంగా 2500ఎకరాల పట్టా భూములను కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆ భూములు ఇవ్వటానికి రైతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి వారి పేర్లను తొలగించి ఆ భూములకు సంబంధించిన పరిహారాన్ని అథారిటీలో జమచేసింది, ఇప్పటివరకు రైతులు ఆ పరిహారాన్ని తీసుకోలేదు. మరోవైపు ఆ భూముల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఈ వానకాలం పంటలు వేయవద్దని అధికారులు సూచించారు.
రైతులు మాత్రం వరి, పత్తి, ఇతర కూరగాయల పంటలను సాగుచేశారు. ఈ భూముల్లో పండించిన పంటలను కొనేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది నిరాకరిస్తున్నారు. పాస్‌బుక్కులు తప్పనిసరిగా ఉండాలని, అలాగే, నిషేధిత జాబితాలో సాగుచేసిన పత్తి, వరిని కొనుగోలు చేయవద్దని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. రైతులు మాత్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, తాము ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చేది లేదని వాపోతున్నారు. ముఖ్యంగా యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడిపల్లి, తాటిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో సుమారు 2500ఎకరాల్లో నాలుగువేల మంది రైతుల వరకు ఉన్నారు. ప్రభుత్వం పంట దిగుబడులు కొనకపోవడంతో రైతులు ఇండ్లలోనే పత్తి, వరి ధాన్యం రాసులు పేరుకుపోయాయి.
హామీ ఇచ్చి మరిచిన సర్కారు
యాచారం మండలంలోని నాలుగు గ్రామాల్లో ఫార్మాసిటీ పేరిట ప్రభుత్వం 2500 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం తీసుకుంది. ఈ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. కానీ పట్టించుకోవడమే మానేశారు. ఇప్పటికే తమ అంగీకారం లేకుండా పట్టా భూములు తీసుకోవద్దని రైతులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ భూములను తీసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫార్మా వ్యతిరేక కమిటీలు తిప్పి కొడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడంలో భాగంగా పంటల కొనుగోలుకు నిరాకరిస్తున్నది. పంటలు సాగు చేయొద్దని చెప్పినా, రైతులు పెడచెవిన పెట్టారని సర్కారు భావిస్తున్నది. రైతుల పేర్లు ఆన్లైన్లో లేవనే సాకుతో కొనుగోళ్లు నిలిపివేసింది.
పంటలను కొనాలి
నాకు నానక్‌నగర్‌లో 8 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమిని తాతల కాలం నుంచి సాగు చేస్తున్నం.ఇప్పడు ఫార్మాసిటీ పేరుతో మా భూములు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నం. నాలుగెకరాల్లో పత్తి, మరో నాలుగెకరాల్లో వరి వేసిన. ఇప్పుడు పంట చేతికి వచ్చింది. తీరా అమ్ముకుందామంటే అధికారులు కొంటలేరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు సరికాదు.
-బల్వంత్‌రెడ్డి, నానక్‌నగర్
ఇది కక్ష సాధింపే..
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిషేధిత జాబితా నుంచి మా భూములను తొలగిస్తామని చెప్పి మాట తప్పిండ్రు. ఇప్పుడు ఏకంగా పంట కొంటలేరు. ఇది అన్యాయం. న్యాయస్థానం ఆదేశించినప్పటికీ రైతుల పేర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం సరికాదు. వెంటనే ఫార్మా రైతుల పంటలను ప్రభుత్వమే కొనాలి.
-సాయికిరణ్