Palemvagu Project | వెంకటాపురం(నూగూరు), జనవరి 20 : పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూడెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆదివాసీ నవ నిర్మాణ సేన (ఏఎన్ఎస్) రాష్ట్ర నాయకులు వాసం నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఆదివాసీ రైతులు రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నర్సింహమూర్తి, నాగరాజు మాట్లాడుతూ.. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.70.99 కోట్లతో పాలెం వాగు ప్రాజెక్టు (మట్టితో)ను ప్రారంభించగా, అప్పట్లోనే రెండుసార్లు గండ్లుపడి కొట్టుకుపోయిందన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదని తెలిపారు. నాలుగు క్రషర్ గేట్లను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును 2017లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించినట్టు వారు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వెంకటాపురం మండలంలోని 32 గ్రామాలకు, వాజేడు మండలంలోని 7 గ్రామాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని కనీసం వెయ్యి ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలని కోరారు. రూ.కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు నీళ్లు రైతులకు ఉపయోగపడటం లేదన్నారు. కెనాల్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గిరిజన రైతులకు సాగునీరు అందడం లేదని అన్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న అధికారులు రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.