కోస్గి, మే 25 : వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి సమీపంలోని కడండపల్లి గ్రామ గేటు వద్ద మద్దూరుకు వెళ్లే రహదారిపై దాదాపు 20 మందికిపైగా అన్నదాతలు బైఠాయించారు. మూడు, నాలుగు రోజుల నుంచి ధనలక్ష్మి రైస్‌మిల్ చుట్టూ తిరుగుతున్నా.. టోకెన్లు అందించి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు. దాదాపు 30 నుంచి 40 వరకు ట్రాక్టర్లు, ఆటోలు ఇతర వాహనాల్లో రైతులు ధాన్యం తీసుకొచ్చారని, కానీ రైస్‌మిల్లు నిర్వాహకులు వాహనాలను లోపలికి రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తున్నదని, తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటలపాటు ఆందోళన తర్వాత పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తామని, వాహనాలు రైస్‌మిల్లులోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ విషయమై మిల్లు నిర్వాహకులను వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.