హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏ విధంగా పంటలు నష్టపోయినా రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో పండిన పంటలు నీళ్లపాలయ్యాయని తెలిపారు. పంట ఏ రకంగా నష్టపోయినా బాధిత రైతులకు పరిహారం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో, రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకూ పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంపై స్పందించకపోతే రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టంలో రైతులను నయవంచన చేశారని విమర్శించారు. అసైన్డ్, పోడు భూముల క్రయవిక్రయాలపై చట్టం తెస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని, చట్టంలో ప్రస్తావించనే లేదని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా, గోదావరిని ఎండబెట్టారని విమర్శించారు. దేవాదుల పంపును ఆన్ చేయకుండా నెలరోజులు ఆలస్యం చేయడంతోపాటు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పంటలు ఎండిపోయాయని నిప్పులు చెరిగారు. నెట్టెంపాడు, జూరాల ఆయకట్టుకు కూడా సక్రమంగా నీళ్లివ్వలేదని, అందుకే ఆగ్రహించిన రైతులు అక్కడ ధర్నాకు దిగారని తెలిపారు.
కర్ణాటక పరిధిలో కృష్ణా నదిపై అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఏపీకి అక్రమంగా అదనపు కృష్ణా జలాలను తరలిస్తున్నా సర్కారులో స్పందనే కరువైందని ధ్వజమెత్తారు. తమ పర్యటనల్లో రైతులు గుండెలవిసేలా వారి బాధలు ఏకరువు పెట్టారని తెలిపారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో 16 నెలల పాలనలో అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలు, కక్ష రాజకీయాలతోనే కాంగ్రెస్ కాలం గడుపుతున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై ముందుచూపు లేదని, హైదరాబాద్‌లో తాగునీటి సమస్య పొంచి ఉన్నదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీఎం, మంత్రుల మధ్య సమన్వయం కొరవడిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజలను ఇక్కట్ల పాల్జేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో వేసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను నిలువునా మోసగించిన ఈ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకోవాల్సిందేనని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని స్పష్టంచేశారు.