బీమాలేక, సాయం అందక రైతుల ఇబ్బందులు యూరియా గోస మొదలు రైతుభరోసా దాకా కాంగ్రెస్ పాలనలో అన్నింటిలోనూ చేదు అనుభవాన్ని చవిచూసిన తెలంగాణ రైతాంగానికి పంటనష్ట పరిహారం ఓ కలగా మారింది. గడిచిన ఆరునెలల కాలంలో పలుమార్లు భారీ వర్షాలతో పంట కోల్పోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం నేటికీ అందలేదు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి నెలదాటినా బాధిత రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వం నుంచి దక్కిందేమీ లేదు.
హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప.. రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది. నెల క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.పదివేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ, నెల దాటినా కార్యరూపం దాల్చలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పంటల బీమా అమలుచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా అమలు చేయలేదు. పంటల బీమా లేక, ప్రభుత్వం పరిహారం అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సెప్టెంబర్ తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కొన్నిచోట్ల వరదల్లో కొట్టుకొనిపోగా, మరికొన్ని చోట్ల నీట మునిగాయి. ఇసుక మేటలు వేశాయి. ముఖ్యంగా వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సెప్టెంబర్లో జరిగిన పంటనష్టంపై సర్వే చేసిన వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 2.36 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లాల వారీగా నివేదిక సమర్పించింది. ఇందులో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో, నిజామాబాద్లో 50 వేల ఎకరాలు, మెదక్లో 31 వేల ఎకరాలు, ఆదిలాబాద్లో 20 వేల ఎకరాలు, నిర్మల్లో 15 వేల ఎకరాలు, మంచిర్యాలలో 16 వేల ఎకరాలు, ఆసిఫాబాద్లో 10 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 9 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అంచనాలున్నాయి. దీనితోపాటు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా 51,528 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనావేసింది. ఈ విధంగా రెండు దఫాల్లో కలిపి 2.87 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.
రైతులకు 287 కోట్ల పరిహారం బాకీ
పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలల్లో 2.87 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ఇందుకు ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు మొత్తం రూ.287 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉన్నది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం నయా పైసా చెల్లించలేదు. మే 28న 51,528 ఎకరాల్లో పంటనష్టానికిగాను రూ.51.52 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆ నిధులు కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.
సీఎం మాటకూ విలువ లేదా?
సీఎం రేవంత్రెడ్డి సెప్టెంబర్ 4న కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటనష్టానికి పరిహారం అందిస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డిలో పర్యటించి నెల దాటింది. ఇప్పటివరకు రైతులకు నయా పైసా పరిహారం దక్కలేదు. సాక్షాత్తు సీఎం చెప్పిన మాటలకు కూడా విలువ లేదా? అనే చర్చ రైతుల్లో జరుగుతున్నది.
పరిహారం లేదు.. పంటల బీమా లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పంటల బీమా అమలుచేస్తామని, అన్ని పంటలకు ఇది వర్తింపజేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా పంటల బీమాను అమలుచేయలేదు. గత సంవత్సరం పంటల బీమాను అమలుచేస్తామని, రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఒకదశలో కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయి, టెండర్ల వరకు వెళ్లింది. అయితే, పంటల బీమా అమలు కోసం ఏటా సుమారు రూ.మూడు వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది. దీంతో వ్యవసాయ శాఖ పంటల బీమా ఫైలును అటకెక్కించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ఎలాగూ పంటనష్ట పరిహారం విడుదల చేయడంలేదు. కనీసం పంటల బీమా అయినా అమలుచేస్తే రైతులకు ఎంతో కొంత ఊరట లభించేది. ఇటు పరిహారం ఇవ్వకుండా, అటు పంటల బీమా అమలు చేయకుండా రైతులకు కాంగ్రెస్ సర్కారు మరింత నష్టం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.