హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్ల (Grain purchases)జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం కోనుగోలు(Grain Purchase) చేయక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తూ, రోడ్లపై బైఠాయిస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో (Yadadri Bhuvanagiri) అన్నదాతలు ఆందోళన(Farmers dharna) బాటపట్టారు.
నెల గడుస్తున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు, బుధవారం బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిని (Hyderabad-Warangal National Highway) దిగ్బంధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ఆందోళన చేస్తున్న రైతులు
స్థానిక తహసీల్దార్ శ్రీధర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, అంతకుముందు భువనగిరి మండలం పచ్చళ్లపాడు తండా గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వడ్లు కొనకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.