బడంగ్‌పేట, నవంబర్3: తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ తనను కలిసిన బాధిత రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లోని బాధిత గుర్రంగూడ రైతులు ఆర్ల నర్సింహ, ఆర్ల శంకర్, ఆర్ల కొమరయ్య, ఇమ్మిడి మల్లేశ్, బాలకృష్ణ తదితరులు బీఆర్ఎస్ నేత ముత్యంరెడ్డితో కలిసి ఆదివారం నాదర్గుల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
భూమి ఇవ్వనందుకు ప్రవీణ్‌రెడ్డి మనుషులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, జేసీబీతో తమ ఇంటి ముందు కందకం తీయించారని, దీంతో బయటకు రావడం ఇబ్బంది అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్‌రెడ్డికి తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వారు ఎప్పుడొచ్చి తమపై దాడిచేస్తారో తెలియక బిక్కుబిక్కుమని బతుకుతున్నట్టు చెప్పారు. స్పందించిన సబిత వారికి అభయం ఇచ్చారు. రైతుల భూములను ఎవరూ బలవంతంగా లాక్కోలేరని తెలిపారు. మీ భూములు మీకు దక్కేలా చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని అభయమిచ్చారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే, ఆయనతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని సబిత భరోసా ఇచ్చారు.