ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 6: అర్హతలున్నా రుణం ఎందుకు మాఫీ కాలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్‌ను మంగళవారం రైతులు నిలదీశారు. బ్యాంకులో ఖాతాలు ఉన్న 30 మంది రైతులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరితో కలిసి బ్యాంకుకు చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నా రెండు విడతల్లో తమ పేర్లు ఎందుకు రాలేదని మేనేజర్‌ను నిలదీయడంతోపాటు కారణాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతికంగా సమస్య తలెత్తిందని, ఆ సమస్యను అధిగమించి త్వరలోనే అందరికీ మాఫీ అయ్యేలా చూస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు.