వరంగల్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పత్తి కొనుగోలుకు కిసాన్ కపాస్ యాప్ తెచ్చామని కేంద్రం చెప్తున్నదంతా ఉత్త గప్పాలేనని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం స్పష్టంచేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ జమిలీగా పత్తి రైతును నట్టేట ముంచుతున్నాయి. రైతుకు కనీస మద్దతు ధరను చెల్లించకుండా ఎత్తివేసేందుకు వేసిన ఎత్తుగడలో భాగమే కిసాన్ కపాస్ యాప్ అని, అందులో భాగంగానే పంట చేతికొచ్చే సమయంలో యాప్‌ను రైతులపై రుద్దిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు సీజన్ మొదలైనప్పుడు కొత్త విధానాలను పరిచయం చేయడం ఆనవాయితీ. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి పత్తి చేతికొచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా యాప్ బండను తమపై వేసిందని రైతులు మండిపడుతున్నారు.
దేశవ్యాప్తంగా కిసాన్ కపాస్ యాప్ అట్టర్‌ఫ్లాప్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీసీఐ పేర్కొన్నట్టుగా రైతులెవరూ స్లాట్ బుకింగ్ కోసం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం లేదని మన రాష్ట్రంలోని రైతుల స్పందనే కాకుండా దేశంలోని పత్తి పండించే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల రైతు అనుభవం చెప్తున్నది. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, మహబూబూబ్‌నగర్ జిల్లాల్లో పత్తి పంట విస్తారంగా పండుతుంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి పండించే రైతులు 3,46,355 మంది ఉంటే, వీరిలో కిసాన్ కపాస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నది 1,907 మంది రైతులు మాత్రమే. ఈ లెక్కన ఈ సంవత్సరం పత్తికి ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110 అసలు రైతులకు చేరే అవకాశమే లేదని, ఎంఎస్పీని ఎగ్గొట్టేందుకే యాప్ అనే అస్ర్తాన్ని ప్రయోగించారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
పత్తి కొనుగోళ్ల విషయంలో సంస్కరణలు, పారదర్శకత పేరుతో సీసీఐ తెచ్చిన కిసాన్ కపాస్ యాప్ రైతులను నిండా ముంచుతున్నదని గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఇదే నవంబర్‌లో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 3,63,675.30 క్వింటాళ్లు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో కొనుగోలు చేసింది 39,810 క్వింటాళ్లు మాత్రమే. అదీ కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదుచేసుకున్న 1,907 మంది పత్తి రైతుల నుంచి.
పత్తి సాగు చేసిన రైతులు మొదటగా తమ స్మార్ట్‌ఫోన్‌లో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం రైతులు తమకు సంబంధించిన 24 అంశాలపై వివరాలను యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుం ది. రైతు పేరు, తండ్రి పేరు, స్త్రీ/పురుషుడు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, నివాస అడ్రస్, భూమి వివరాలు, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం, దగ్గర్లోని మార్కెట్ పేరు, కౌలు రైతా, సొంత రైతా, పాస్‌బుక్ నంబర్, మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఇందులో ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు? ఏ రకమైన పత్తి సాగు చేశారు? ఆధార్‌కార్డు, రైతు ఫొటో అప్లోడ్ చేయాలి.
పత్తిని ఎప్పుడు మార్కెట్‌కు తీసుకువస్తరు? ఎన్ని క్వింటాళ్ల పత్తి తెచ్చే అవకాశం ఉన్నది? ఇంకా ఎంత పత్తి వచ్చే అవకాశం ఉన్నది? వంటి వివరాలను ఇవ్వాలి. ఆ రైతు పత్తిని ఏ సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి? అనే విషయాన్ని అదే ఫోన్లో రైతుకు సీసీఐ మార్గదర్శనం చేస్తుంది. దాని ప్రకారం రైతు తన పత్తిని అమ్ముకోవాలి.